KTR | అవే ఆందోళనలు, అవే ఆవేదనలు, సుడులు తిరిగిన బాధితుల కంటనీరు ఓ వైపు… బరువెక్కిన గుండెలతో తన్నుకొచ్చే దుఖం మరోవైపు. దశాబ్దాలుగా పుట్టి, పెరిగిన ఇండ్లను కూల్చేందుకు వస్తున్న కాంగ్రెస్ బుల్డోజర్లు బడుగు జీవుల మనసులను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. మూసీ ప్రక్షాళన పేరిట సీఎం రేవంత్ రెడ్డి పేదల గూళ్లను కూల్చేసే కుట్రలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ ఇంటిపై పడిన ఎర్ర గుర్తులను చూసి రోడ్డున పడనున్న తమ జీవితాలను తలుచుకుని విలపిస్తున్నారు. సోమవారం కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి బృందం నగరంలోని హైదర్‌గూడలోని లక్ష్మీనగర్, కిషన్‌బాగ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులను ఓదార్చింది. మూసీ అభివృద్ధి పేరిట పేదల బతుకులను సర్వనాశనం చేసే ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు.
-సిటీబ్యూరో/మైలార్‌దేవ్‌పల్లి/అగ్రికల్చర్ వర్సిటీ/చార్మినార్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
కిషన్‌బాగ్, హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన సంఘీభావ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ”ఆడబిడ్డల కన్నీళ్లకు కారణమవుతున్న ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నది.1906లో వరదలు వచ్చా యి. అప్పటి నిజాం ప్రభుత్వం ఇంజినీరింగ్ విశ్వేశ్వరయ్యను పిలిచి రెండు జంట జలాశయాలను నిర్మించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడూ నగరానికి వరద ముంపు సమస్య రాలేదు. కానీ 2020లో కురిసిన కుంభవృష్టితో ఒక్కసారిగా నగరం మునిగింది.
అలాంటి పరిస్థితుల్లోనూ అప్పటి సీఎం కేసీఆర్ బాధితులకు అండగా నిలిచారు. పర్మిషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ యే… రిజిస్ట్రేషన్ చేసేది వారే, అనుమతులిచ్చేది వారే… ఇప్పుడు పేదల ఇండ్లను పేకమేడల్లా కూల్చేది వారే. నమామి గంగే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళనకు రూ. 40వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ 55 కిలోమీటర్లు కూడా లేని మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. మూసీ ప్రక్షాళన చేయమని ఎవరడిగారని అన్నారు.
మూసీ సర్వేకు నిరసనగా నగరంలో మూడ్రోజులుగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇన్నాళ్లు నీడనిచ్చిన తమ నివాసాలన్నీ మూసీలో కలుస్తున్నాయంటూ విలపిస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు బలవుతున్న ఎంతోమంది బాధితులకు బీఆర్ఎస్ భరోసానిచ్చేలా మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తున్నది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, కార్తీక్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు హైదర్‌గూడ, కిషన్‌బాగ్ ప్రాంతాల బాధితులకు అండగా నిలిచారు. మీ ఇండ్లకు బీఆర్ఎస్ రక్షణగా ఉంటుందని, మీకు అండగా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని బాధ్యతను భుజాన వేసుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆందోళనలు, ఆక్రందనలతో హైదరాబాద్ అల్లకల్లోలంగా మారుతుంది. నగరంలో బీఆర్ఎస్ను గెలిపించారనే కోపంతోనే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు పేరిట లక్షల మందిని రోడ్డున పడేలా చేస్తున్నారు. కొడంగల్‌లోని రెడ్డికుంటలో ఉన్న సొంతిళ్లు, దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉన్న సోదరుడి ఇంటిని ముందుగా కూల్చివేయాలి. జంట జలాశయాల వెంబడి ఉన్న కాంగ్రెస్ పెద్దల భవంతులను కూల్చాలి. రెక్కల కష్టం చేసుకుని కూడబెట్టుకున్న పైసలతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు, కట్టిన ట్యాక్సులతో భావోద్వేగాలతో కూడిన ఇంటిని కూల్చేస్తానంటే ఊరుకునేది లేదు.
మూసీ విషయంలో హైకోర్టు కూడా గట్టిగానే వాయించింది. హైకోర్టును మోసం చేసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మూసీ మార్కింగ్‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకోవడం సిగ్గుచేటు. డబ్బులిచ్చి మాట్లాడిస్తున్నారని మంత్రులు సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా మీ వెనుకాల బడా బిల్డర్లు ఉన్నారని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు వరకు పోరాడి, సంఘటితంగా కాంగ్రెస్ గద్దలను ఎదుర్కోవాలన్నారు. చట్టాలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా అవగాహన కల్పిస్తాం.
మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం ప్రజల భూములు తీసుకోవాలంటే.. పరిహారానికి పలు విధానాలున్నాయి. మార్కెట్ విలువకు మూడింతలివ్వాలి. లేదా నిర్మాణ ధర, భూముల పరిహారం వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు వేసిన ఓట్లతో గెలిచి, బుల్డోజర్లు దింపుతున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి. మీ ఇండ్లపైకి వచ్చే బుల్డోజర్లకు మేమందరం అడ్డుగా నిలబడతాం. ఎవరూ అధైర్యపడొద్దు. ఇక బీజేపీ నేతలు రేవంత్ పాలన సూపర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. పేదల ఇండ్లను మూసీలో కలిపేందుకు సిద్ధమైన కాంగ్రెస్ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
హైడ్రాతో భయపెడుతున్నారు..
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన కేటీఆర్ ఓవైపు.. పదేండ్లలో కేసీఆర్ పాలనతో ప్రశాంతంగా ఉందని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కానీ ఈ బద్మాష్ పాలనతో హైడ్రా పేరిట ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే పేదల పొట్ట కొట్టేలా మూసీ కోసం ఇండ్లు కూల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇండ్లపైకి బుల్డోజర్లు తీసుకువచ్చే తీస్మార్ఖాన్లు నగరంలో ఎవరూ లేరనే విషయాన్ని మూసీ బాధితులు గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.