గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో రజతోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ భారీ బహిరంగ సభకు శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ వేడుకను ప్రతి కార్యకర్త ఇంట్లో పండుగ వాతావరణంలో జరుపుకొనేలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 8న తెలంగాణ భవన్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశంలో రజతోత్సవ సభ విజయవంతం చేసేలా దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3వేల మంది సభకు వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ గొప్ప పరిపాలనదక్షుడని ఈ సందర్భంగా సన్నాహక సమావేశంలో నేతలు చెబుతున్నారు. ఉద్యమ సారథియే తెలంగాణ మొదటి సీఎంగా ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి వేగంగా జరిగిందని కొనియాడుతున్నారు. డివిజన్ల వారీగా చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణలు చేస్తూ 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక పండుగ తమ ఇంట్లో పండుగగా ప్రతి ఒక్క కార్యకర్త భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. గ్రేటర్లో కార్యకర్తలందరితో వరంగల్‌కు బయలుదేరడంపై సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా నేతలు వివరిస్తున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ):
తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 10.30 గంటలకు గ్రేటర్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని నిర్వహిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సభ విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఇతర ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొంటారని తలసాని వివరించారు.