కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 21: కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటుచేసుకున్నది. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసింది ఓ మహిళ. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చి పెట్టి.. ఎవరికి అనుమా నం రాకుండా ఊరికి వెళ్లింది. ఇందుకు ఆమె సోదరి, ఆమె భర్త సహకరించారు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం, పాత లింగయ్య పల్లి గ్రామానికి చెందిన బోయిని సాయిలు (45), కవిత (42) లకు 20 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉ న్నారు.
అయితే.. పెళ్లయిన కొద్ది రోజులకే కవిత ప్రవర్తన అనుచితంగా ఉండడంతో.. భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. సాయిలు పిల్లలతో కలిసి ఊరిలో.. కవిత హైదరాబాద్‌కు వచ్చి ఉంటుంది. ఆమె ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటుందని సమాచారం. అప్పుడప్పుడు ఊరికి వెళ్లి భర్త, పిల్లలను కలిసి తిరిగి నగరానికి వ స్తుండేది.
ఈ క్రమంలో ఈనెల 12న ఊరికి వెళ్లిన కవిత.. భర్త సాయిలును కలిసి.. హైదరాబాద్‌లో ఉద్యోగం చూపిస్తాను అంటూ తీసుకొచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న తన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేశ్‌లు నివాసం ఉంటున్న గుడిసెకు కవితా, సాయిలు వచ్చారు. ఈనెల 18న భార్య కవిత ప్రవర్తన పై సాయిలు గొడవ పడ్డాడు. దీంతో కవిత.. తన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేశ్‌లు కలిసి సాయిలు ను హతమార్చాలని పథకం వేసుకున్నా రు. వెంటనే కరెంట్ షాక్ ఇచ్చి సాయిలును హత్య చేశారు.
శవాన్ని మూటలో కట్టి..
సాయిలు చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు.. శవాన్ని మాయం చేయాలనుకున్నారు. శవాన్ని మూటలో కట్టి ఆటోలో వేసుకొని ఊరికి వెళ్లే మార్గమధ్యలో ఎక్కడైనా నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చి పెట్టాలనుకున్నారు. అక్కడే ఓ ఆటోను మాట్లాడుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి మూటలో ఏముందని వారిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో వారు.. తమపని కాదని నిర్ణయించుకొని తిరిగి జ్యోతి, మల్లేశ్‌లు నివాసముండే ఇంటికి మూటతో చేరుకున్నారు.
ఆ తర్వాత రాత్రి సమయంలో వారు నివాసం ఉం డే ప్రాంతానికి సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్మాణ వ్యర్థాల కింద పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం రా కుండా ఉండాలని.. కవిత మరునాడు సొంత ఊరికి వెళ్ళింది. భర్త సాయిలు ఇసుక పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని అబద్ధం చెప్పింది. పొంతన లేని మాటలు చెబుతున్న కవితపై అనుమానం వచ్చిన సాయిలు తల్లి, పిల్లలు ఊరి పెద్దలకు విషయాన్ని చెప్పారు.
ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో..
మృతదేహాన్ని మాయం చేసేందుకు మాట్లాడుకున్న ఆటో డ్రైవర్ వాళ్లకు సహకరించకపోగా… మరునాడు వారిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరోవైపు ఊరు నుంచి పెద్దలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… జ్యోతి, మల్లేశ్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. చివరకు కవిత….తన భర్త సాయిలు హెచ్ఐవీ తో బాధపడుతున్నాడని, అనుమానంతో తనను పెళ్లయినప్పటి నుంచి వేధిస్తున్నాడని, ఆ వేధింపులను భరించలేక తన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేశ్‌ల సహకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలిసింది.
అనంతరం సాయిలు మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించా రు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రాజశేఖర్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మండల రెవెన్యూ అధికారుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాయిలు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.