కవాడిగూడ, నవంబర్ 1: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన కోటి దీపోత్సవం రెండోరోజు మంగళవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తిటీవీ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల నేతృత్వంలో జరుగుతున్న ఈ కోటి దీపోత్సవం కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు హాజరై కోటి దీపాంతలను వెలిగించారు. దీంతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడింది.
కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతి స్వామి, శక్తి పీఠం పీఠాధిపతి మాతా రమ్యానందభారతి, ప్రవచన కర్త నోరి నారాయణ మూర్తి నేతృత్వంలో నలభై నిమిషాల పాటు ఆలంపురం జోగులాంబ కల్యాణోత్సవం, కంచి కామాక్షి అమ్మవారికి కోటి పసుపు కొమ్ముల అర్చన, భక్తులచే కామాక్షి విగ్రహాలకు కోటి పసుపు కొమ్ముల అర్చన నిర్వహించారు. అనంతరం నందివాహనంపై ఆలంపురం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులచే కార్తిక దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ హాజరై పూజలు నిర్వహించారు.