కొండాపూర్, ఫిబ్రవరి 22 : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని కొండాపూర్ 8వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ పి.మురళీకృష్ణ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బెటాలియన్ అధికారులు, సిబ్బంది కలిసి హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీని నిర్వహించారు. మురళీకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను, కార్లలో ప్రయాణిస్తున్నవారు సీట్ బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ప్రమాదం బారిన పడుతున్న ద్విచక్ర వాహనదారుల్లో చాలా వరకు హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాన్ని నడిపే వారితోపాటు వెనకాల కూర్చున్న వ్యక్తి సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అదనపు కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.