Konda Surekha | నాంపల్లి, క్రిమినల్ కోర్టు, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం, క్రిమినల్ కేసు సమంజసమేనని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సోమవారం కోర్టుకు వాదనలు వినిపించారు. కొండా సురేఖపై కేసు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆమె తరఫు న్యాయవాది గురుమీత్‌సింగ్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. సమంత-నాగచైతన్య విడాకుల అంశానికి ఎన్-కన్వెన్షన్ కూల్చివేత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతర కరంగా ఉన్నాయన్నారు. నాగార్జునతో పాటు యార్లగడ్డ సుప్రియ వాంగ్మూలాలతో పాటు కోర్టుకు సమర్పించిన వీడియో-పత్రికల్లో వచ్చిన క్లిప్లింగ్ల సాక్షాధారాల మేరకు కేసు నమోదు చేసిందన్నారు.
సురేఖపై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేసేందుకు ప్రజాప్రతినిధుల కోర్టుకు అర్హత లేదని ఆమె తరఫు న్యాయవాది వాదనలో అర్థంలేదన్నారు. సీఆర్పీసీ నియమ నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేసినట్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణలో నిజానిజాలు బహిర్గతమువుతాయన్నారు. చట్టం ముందూ అందరూ సమానమేనని, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నంత మాత్రాన అసభ్యకర పదజాలంతో నాగార్జున కుటుంబం పరువుకు భంగం కల్పించే విధంగా ఉన్నాయన్నారు.
కేసు గురించి విచారణ చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోర్టుకు తెలిపారు. రివిజన్ పిటీషన్‌ను కొట్టివేయాలని, విచారణ కొనసాగించేందుకు వీలు కల్పించాలని న్యాయవాది కోరారు. గతేడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నమోదు చేసిన పరువు నష్టం కేసు ఉత్తర్వులో పేర్కొన్న అంశాలు సరైనవి కావని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. రివిజన్ అప్పీల్‌పై ఇరువైపుల వాదనలు విన్న 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ 8కి తీర్పును రిజర్వు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.