చేర్యాల, జనవరి 17: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. గత డిసెంబర్ 28న కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించిన ఆలయ వర్గాలు, ఇప్పుడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలు ప్రముఖ కార్యక్రమాలు, ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించడంతో సుందరంగా కనిపిస్తున్నాయి.
ఈ నెల 19న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగుతాయి. 12 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు విశిష్ట దర్శనం, శ్రీఘ్రదర్శనం, ధర్మ దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కె.రామాంజనేయులు తెలిపారు. పట్నం వారానికి ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్ భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల చేపట్టి, పట్నం వారం స్వామిని దర్శించుకున్న అనంతరం, దీక్షను విరమిస్తారు. పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. పట్నం వారానికి 50 వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ నెల 20న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయ వర్గాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.