City Street Vendors | కొండాపూర్: ‘ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న కుమారీ ఆంటీకో న్యాయం… అదే స్ట్రీట్‌లపై వ్యాపారం చేసుకుంటున్న మాకో న్యాయమా’ అంటూ నాలెడ్జ్ సిటీలోని ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకుంటున్న స్ట్రీట్ వెండర్స్ ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారమివ్వకుండా టీఎస్ఐఐఎస్, ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా తమ స్టాళ్లను తొలగించడంతో గురువారం నిరసన తెలిపారు.
ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా సాఫ్ట్వేర్ సంస్థలకు దూరంగా బతుకుదెరువు కోసం స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాపారం చేసుకుంటున్న తమపై దౌర్జన్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేలా, అత్యవసర సమయంలో కనీసం అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్న కుమారీ ఆంటీ స్టాల్ వైపు మాత్రం కన్నెత్తి చూడని అధికారులు.. తమపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌పాత్ స్టాల్స్ వైపు వెళ్లవద్దని, వాళ్ల వ్యాపారాలకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పినా.. టీజీఐఐఎస్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి స్టాల్స్ నడుపుతున్న వారిపై చూడని అధికారులు, స్థానికులమైన తమపై కక్షపూరితంగా వ్యవహరించడం వెనకాల కారణాలేమింటో తెలుపాలన్నారు. స్టాల్స్ తొలగింపుతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.