Hyderabad | కార్వాన్ : మంచి నీళ్ల కోసం ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దారుణ ఘటన గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 22 సమీపంలోని ఓ నిర్మాణ భవనంలో పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఆశ్రయం పొందుతున్నారు. అయితే మహారాష్ట్ర అకోలా ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీర్(28), బీహార్ వాసి అబ్దుల్ సమీ(21) మధ్య మంచి నీటి కోసం గురువారం రాత్రి 11 గంటల సమయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణ కాస్త ముదరడంతో.. సహనం కోల్పోయిన అబ్దుల్ సమీ కత్తితో సయ్యద్ సమీర్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సయ్యద్‌ను చికిత్స నిమిత్తం నానల్‌నగర్‌లోని ఓలివ్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. నిందితుడు అబ్దుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ బైరి రాజు తెలిపారు.