అబిడ్స్, ఆగస్టు 4: అపహరణకు గురైన చిన్నారిని అబిడ్స్ పోలీసులు రక్షించారు. దుండగుడిని పట్టుకున్న పోలీసులు..వైద్యపరీక్షల కోసం చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆదివారం అబిడ్స్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కూతురు (6)ను తీసుకుని శనివారం మధ్యాహ్నం అబిడ్స్ కట్టెలమండిలో పుట్టింటికి వెళ్లింది.
అక్కడ స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆడుకుంటున్న చిన్నారి అపహరణకు గురైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా, చిన్నారి గుర్తుతెలియని వ్యక్తి చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ వెళ్లి..ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను విచారించగా, అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో దింపినట్లు చెప్పాడు. అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు.
జహంగీర్ పీర్ దర్గాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నిందితుడు బాలికతో వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం ఉదయం కొత్తూరు మండలం ఇనుముల నర్వ గ్రామ సమీపంలో బాలికను తీసుకొని వెళ్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకోవడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిందితుడు బీహార్‌కు చెందిన మహ్మద్ బిలాల్ అన్సారీ(32)గా గుర్తించారు.
బాలికను కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల నుంచి డబ్బుల డిమాండ్ చేయాలని పథకం పన్నినట్లు డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. సైకిల్ కొనిస్తానని, డాడీ దగ్గరకు తీసుకెళ్తానంటూ.. చిన్నారిని నమ్మించి.. అపహరించినట్లు చెప్పారు. బిలాల్ అన్సారీపై అనేక కేసులున్నాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు వచ్చిన తరువాత కొత్తూరు పరిధిలోని ఎనిమిదేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో బిలాల్ అన్సారీ నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు.