బంజారాహిల్స్,ఆగస్టు 29: మాయమాటలు చెప్పి ఇద్దరు పిల్లలను తనతో పాటు తీసుకువెళ్లిన పాతనేరస్తుడిపై బంజారాహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాంపల్లిలో ఉంటున్న మహ్మద్ రహీం అలియాస్ అల్లాబక్స్(22) దినసరి కూలీ. హకీంపేటలోని ఓ హోటల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఇద్దరు బాలలతో పరిచయం ఏర్పడింది. ఈనెల 19న బేగంపేటలో బైక్‌ను చోరీ చేసి.. జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూపిస్తానంటూ ఆ బాలలను నమ్మించి తనతో పాటు తీసుకువెళ్లాడు. కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రహీం బైక్‌పై ఆ చిన్నారులను విజయవాడకు తీసుకువెళ్లాడు.
అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో సూర్యాపేటకు రాగానే పెట్రోల్ అయిపోయింది. అక్కడున్న ఓ గుడిలో చోరీకి యత్నించడంతో సిబ్బంది రహీంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు విచారించగా బైక్ చోరీ, మిస్సింగ్ కేసు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు సమాచారం ఇవ్వగా, బేగంపేట పోలీసులు నిందితుడిని చోరీ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే బంజారాహిల్స్‌లో ఇద్దరు పిల్లలను తనతో పాటు తీసుకువెళ్లిన రహీంపై కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసిన పోలీసులు.. పీటీ వారెంట్ ద్వారా అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. గతంలో నిందితుడిపై పలు కేసులున్నట్లు విచారణలో తేలింది.