ఖమ్మం టూ.. మహారాష్ట్ర.. గంజాయి తరలింపు
షాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎనిమిది మంది అరెస్టు, 400 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ జగదీశ్వర్ రెడ్డి
శంషాబాద్ రూరల్, మార్చి 1 : ఖమ్మం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుంచి సుమారు రూ.1.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన సుభాష్(ఏ1), భాష (ఏ2) గంజాయి సరఫరా చేసి ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలోని పింప్రి ప్రాంతానికి చెందిన పరశురాం, ఉమేశ్ గైక్వాడ్, ప్రదీప్, దత్త సాకేత్, సతీశ్, విశాల్పుపట్, అవోక్ అంకుశ్లతో కిలో రూ.2వేల చొప్పున విక్రయిస్తామని బేరం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌కు చెందిన లారీని గంజాయి తరలించేందుకు మాట్లాడుకున్నారు.
పోలీసులకు దొరకకుండా లారీ డ్రైవర్ వెనుకాల ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి గంజాయి సరఫరా చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తుండగా.. సోమవారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాబాద్ చౌరస్తా వద్ద లారీని ఆపి తనిఖీ చేయగా.. గుట్టు రైట్టెంది. లారీ డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 400 కిలోల గంజాయి, కారు, లారీ, 15వేల నగదు, 9 సెల్ఫోన్లు, తదితర మొత్తం రూ.1.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మీడియా సమావేశంలో అడిషినల్ కమిషనర్ నారాయణ, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి, శంషాబాద్ జోన్ ఎస్వోటీ ఎస్ఐ రవి, సిబ్బంది ఉన్నారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 1 : గంజాయి విక్రయిస్తున్న యువకుడిని కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. మూసాపేట ప్రగతినగర్‌కు చెందిన మహ్మద్ అజార్ (19) మెకానిక్. కేపీహెచ్‌బీ కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడికి దీపక్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు.