సిటీబ్యూరో/ఖైరతాబాద్: గ్రేటర్లో నిమజ్జన కోలాహలం నెలకొంది. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ తీరం భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ వినాయక మండపం వద్ద భక్తులు భారీగా పోటెత్తారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం 6 గంటల నుంచే క్యూలైలన్నీ నిండిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, లక్డీకాపూల్ చౌరస్తా, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి వరకు సుమారు 5 లక్షలకు పైగా భక్తులు దర్శించుకొని ఉంటారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.