ఖైరతాబాద్, ఆగస్టు 28 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి తోలిపూజలో పాల్గొన్నారు. 71వ సంవత్సరాల ప్రస్థానంలో ఈ ఏడాది 69 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షంలోనూ జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, గణేశ్ ఉత్సవాలకు భద్రత కల్పిస్తున్న 600 మంది పోలీసు సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బందికి తొమ్మిది రోజుల పాటు భోజన వసతి కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది. అలాగే భక్తులకు ప్రతి రోజూ ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..
ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల నూలు కండువా, జంధ్యం, గరికమాల, పట్టువస్ర్తాలను సమర్పించారు. తొలుత రాజ్‌దూత్ చౌరస్తాలో ప్రత్యేకంగా అలంకరించిన గుర్రం భగ్గీలో ఆయా కైంకర్యాలను డప్పు చపుళ్లు, ఒగ్గుడోలు, గుస్సాడి, కోలాటాల నృత్యాలతో ఊరేగింపుగా గణపతి చెంతకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షులు గుర్రం కొండయ్య, ప్రధానకార్యదర్శి ఏలె స్వామి తదితరులు పాల్గొన్నారు.
మహాగణపతి చెంత మహిళ ప్రసవం
మహాగణపతి చెంత ఓ మహిళ ప్రసవించింది. రాజస్థాన్‌కు చెందిన రేష్మా, జ్ఞాని దంపతులు ప్రతి ఏడాది గణేశ్ నవరాత్రోత్సవాలకు వస్తుంటారు. బుగ్గలు, ఆటవస్తువులు విక్రయించి పొట్టపోసుకుంటారు. నిమజ్జనోత్సవం ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలానికి వెళ్లిపోతారు. బుధవారం మహాగణపతి ప్రాంగణంలో ఉన్న ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. పోలీసులు ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, లోనికి ప్రవేశించే ముందు ప్రసవం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా బెడ్‌పైకి తీసుకువచ్చి చికిత్సను అందించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
19 వేల మందితో బందోబస్తు
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ కమిషనరేట్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నగర వ్యాప్తంగా 19 వేల మంది పోలీసులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. బయటి జిల్లాల నుంచి అదనంగా మరో 8,500 పోలీసులు, 42 ప్లాటూన్లు, 10 సీఏపీఎఫ్ కంపెనీలు, ఆక్టోపస్ బృందాలు వస్తున్నాయని, మొత్తం 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఖైరతాబాద్ బడా గణేశ్‌ను ఆయన గురువారం సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6న జరిగే నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. అనంతరం అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేశ్ మండపానికి వెళ్లే దారులను, బారికేడింగ్ వ్యవస్థను పరిశీలించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఇతర పాయింట్లను పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ అడిషినల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు.