Hyderabad | హైదరాబాద్‌లో కుక్క వెంటపడటంతో యువకుడు మృతిచెందిన ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. యువకుడే కుక్కను తరుముతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలిసింది. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న తెనాలి వాసి ఉదయ్(23) తన స్నేహితులతో కలిసి బర్త్‌డే పార్టీ కోసం చందానగర్‌లో ఉన్న వీవీ ప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తులోకి వెళ్లిన ఉదయ్.. అక్కడ తనకు కనిపించిన కుక్కను తరిమాడు. దాని వెంట పడుతూ అటూ ఇటూ పరుగెత్తించాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన ఉదయ్.. హోటల్ కిటికీలో నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తొలుత కుక్క వెంటపడటంతో భయాందోళనకు గురైన ఉదయ్ పరిగెత్తుతూ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయాడని అంతా భావించారు. కానీ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. దీంతో సదరు యువకుడే కుక్కను తరిమినట్లు తెలిసింది.
కుక్కను తరుముతూ 3వ అంతస్తు నుండీ పడిపోయి మరణించిన ఉదయ్. హైదరబాద్ లో ఘటన.#Hyderabad #Dog #Telangana #UANow pic.twitter.com/tlqmyT4Rap
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 22, 2024