Anurag University | అమీర్‌పేట, ఏప్రిల్ 21 : ప్రపంచ స్థాయి విద్యను మన విద్యార్థులకు అందించేందుకు ఆరిజోనా యూనివర్శిటీ, అనురాగ్ యూనివర్శిటీల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని హోటల్ మ్యారీగోల్డ్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఈ రెండు యూనివర్సిటీల మధ్య జరిగిన ఒప్పందాని(ఎంఓయూ)కి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరిజోనా యూనివర్సిటీతో అనురాగ్ విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆరిజోనా యూనివర్శిటీలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అందులో లక్ష మంది అక్కడి క్యాంపస్‌లోనే ఉంటున్నారని తెలిపారు. 200 పైచిలుకు కోర్సులను అందజేస్తున్న ఆరిజోనా యూనివర్శిటీలో చదువుకోవాలనే కలను నెరవేర్చడం కోసం అనురాగ్ యూనివర్శిటీ ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు సంవత్సరాలు బీటెక్ చేసి మిగిలిన రెండు సంవత్సరాలు ఆరిజోనా చదువుకునే అవకాశం ఉందని, అలాగే ఇక్కడ సంవత్సరం పాటు ఎంటెక్ చేసి మరో సంవత్సరం ఆరిజోనాలో చదువు పూర్తి చేసి అక్కడి డిగ్రీ అందుకునే అవకాశం ఉందని వివరించారు. అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ఆరిజోనా యూనివర్శిటీలో చదుకునే అవకాశం కల్పించడమే ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. అలాగే ఫ్యాకల్టీ ఎక్సేంజ్ చేసుకునే సౌలభ్యం ఒప్పందం ద్వారా ఉందని తెలిపారు.
ఎన్ఐఆర్ఎఫ్, న్యాక్, ఎన్బీఏ ర్యాంకింగ్ కలిగి ఉండటంతో అనురాగ్‌తో ఒప్పందానికి ఆరిజోనా ముందుకొచ్చిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆరిజోనా యూనివర్శిటీతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారని పేర్కొన్నారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విద్యార్థులు ఎటువంటి అభద్రతా లేకుండా పూర్తి రక్షణతో ఆరిజోనాలో చదువుకునే అవకాశం ఉందని అన్నారు.