సర్వాంగ సుందరంగా పల్లె ప్రకృతివనం
అందరి ప్రోత్సాహంతోనే అభివృద్ధి
కీసర సర్పంచ్ మాధురి
కీసర, మే 31 : పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న కీసర మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కీసర సర్పంచ్‌గా రెండు పర్యాయాలు చేయడంతో పూర్తి అనుభవం ఉన్న సర్పంచ్ నాయకపు మాధురి కీసర అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టారు. 15వేల జనాభా, 10వేల ఓట్లు కలిగిన కీసరను అన్ని గ్రామాలకంటే అగ్రగామిగా మారుస్తున్నారు. పల్లె ప్రగతిలో కీసర రూపురేఖలను మార్చివేశారు. కీసర అభివృద్ధి కోసం దాతల నుంచి సంపూర్ణ సహకారం తీసుకొని భారీ ఎత్తున నిధులను సేకరించారు. ఒకవైపు మంత్రి మల్లారెడ్డి సహకారం, ఎంపీ సంతోష్‌కుమార్ సహకారం, పంచాయతీ, మండల్ ఫండ్, జిల్లా పరిషత్‌ల నుంచి కేటాయించిన నిధులను గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకుంటున్నారు. అద్దంలాంటి వీధులు, మెరుగైన డ్రైనేజీలు, ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనాలు, ఆఖరి మజిలీకి అద్భుత వైకుంఠధామాలు, ఎప్పటికప్పుడు బస్తీలోంచి ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలింపు, వ్యర్థాలతో కంపోస్టు ఎరువుల తయారీతో కీసర గ్రామం అభివృద్ధిలో అగ్రగామీగా మారుతున్నది.
పల్లెప్రగతితో అనేక మార్పులు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతితో కీసరలో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామానికి ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించి అనేక వనరులను సమకూర్చుతున్నారు. కీసర పంచాయతీ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్నది. గ్రామంలో పారిశుధ్యం సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ చెత్త ట్రాక్టర్‌ను పంపించి చెత్తను తెప్పించి తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు నేడు చక్కటి ఆహ్లాదకరంగా మారిపోయాయి. కీసర గ్రామానికి రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, మంత్రి మల్లారెడ్డి పలుమార్లు పర్యటించి కీసర అభివృద్ధిలో భాగస్వాములై అభివృద్ధికి శ్రమిస్తున్న సర్పంచ్ నాయకపు మాధురిని అభినందించి ప్రశంసలు కురిపించారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది
కీసర గ్రామాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా మార్చుతున్నా. పంచాయతీ సభ్యులు, గ్రామపెద్దల సహకారం తీసుకొని రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతిలో అనేక రకాల అభివృద్ధి పనులను చేపట్టి కీసరను అభివృద్ధి చేస్తున్నా. రెండుసార్లు సర్పంచ్‌గా గెలువడంతో గ్రామాభివృద్ధిపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఎంపీ సంతోష్‌కుమార్ కూడా కీసర అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించారు. ఇటీవల కీసరలో నిర్వహించిన పల్లె ప్రగతికి వచ్చిన ఎంపీ మరో రూ.3 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మంత్రి మల్లారెడ్డి సహకారంతో కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాం.
– నాయకపు మాధురి, కీసర సర్పంచ్