హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న క్రమంలో భూ రంధ్రాలతో పాటు చెట్ల పొదలు, మట్టి గోడల్లో దాగి ఉన్న పాములు బయటకు వస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 600 పాములను పట్టుకున్నట్లు ఎన్జీవో సంస్థ ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ వెల్లడించింది. ఈ సంఖ్య మార్చి నాటికి 800లకు చేరింది. ఇక ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 800లకు పైగా పాములను రక్షించినట్లు స్నేక్స్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగానే పాములు వేడిమిని తట్టుకోలేక బయటకు వస్తున్నాయని చెప్పారు. ఇక ఏప్రిల్, మే నెలలు నాగుపాము, ర్యాట్ స్నేక్కు సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.
అయితే నగర శివారు ప్రాంతాలతో పాటు సిటీలో అధిక జన సాంద్రత ఉన్న ఏరియాల్లో పాములను ఎక్కువగా పట్టుకున్నట్లు స్నేక్స్ సొసైటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మే రెండో వారం నుంచి ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.