మేడ్చల్, ఫిబ్రవరి 11: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మేడ్చల్ ప్రాంత రైతులకు ఇది గొప్ప అవకాశమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరులోని రైతు వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.4.70 కోట్లతో ఏర్పాటు చేసిన కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, మల్కాజి గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో పూడూరులో ఫుడ్ ప్రాసింగ్ యూనిట్ ఏర్పాటైందని తెలిపారు.
రైతును రాజు చేయడమే కేసీఆర్ ఆలోచన అన్నారు. ఆయన చూపిన దారిలో రాజశేఖర్ రెడ్డి, తాను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశామని పేర్కొన్నారు. రైతులు పండ్లు, కూరగాయలు పండిస్తే ఆర్థికంగా లాభపడవచ్చన్నారు. అధిక మొత్తంలో పంట ఉత్పత్తి జరిగి, ధర తక్కువగా ఉన్నప్పుడు టమాట, ఆలు తదితర కూరగాయాలను ప్రాసెసింగ్ చేసి, జ్యూస్, చిప్స్ గా మార్చడం ద్వారా రైతు ఆర్థికంగా నష్టం పోకుండా లాభాలు పొందవచ్చని చెప్పారు. తెలంగాణ ఎక్కడా కూడా సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్ లేదని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ శ్యామ్లాల్, మాజీ సర్పంచులు బాబు యాదవ్, మహేందర్, మోహన్ రెడ్డి, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, డైరెక్టర్లు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, నాయకులు శశికుమార్, శ్రీకాంత్, కోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.