హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నీళ్లకోసం అరిగోసలు పడిన నల్లగొండ కన్నీళ్లను తుడిచిన కార్యసాధకుడు కేసీఆరేనని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014కు ముందు మంచినీళ్ల కోసం పడ్డగోసలు గుర్తు చేసుకుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. గతంలో సూర్యాపేటలో మంచినీళ్లంటే మూసీ మురికినీళ్ల మూట అని, అదే ఇప్పుడు ఎకడ చూసినా జలాల ఊటగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో తెలంగాణ అంతటా జలోత్సవం జరుగుతుందన్నారు.
ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలో వీరాచారి దాబా వద్ద ఆగిన జూలూరు అకడ మంచినీళ్లను తాగి ఉద్యమ సందర్భంగా ఆనాటి నీళ్లబాధను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ల పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన సూర్యాపేట పట్టణంలో నీళ్లకోసం గతంలో పడిన తపనను ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో నీళ్లు తాగాలంటే పచ్చటి రంగు ఉన్న నీళ్లు తాగక తప్పని పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం రాకముందు సూర్యాపేట లాంటి అతిపెద్ద పట్టణానికి మంచినీటిని సరఫరా చేయడానికి మూసీలో బావి తవ్వి అకడి నుంచి తీసుకొచ్చి, ఫిల్టరు బెడ్డుకు పంపి సరఫరా చేసేవారని ఆయన గుర్తుచేశారు.
‘మహానగర బస్తీ పాయఖాన నీళ్లు సూర్యాపేట బస్తీకి మంచినీళ్ల కింద సప్లయ్ చేస్తున్నారని ఆనాటి జలసాధన నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ చేసిన ఆగ్రహ ప్రకటనను ఈ సందర్భంగా జూలూరు గుర్తు చేసుకున్నారు. ఇంత భయంకరమైన నీటి సమస్యకు సీఎం కేసీఆర్ సారధ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కారం లభించిందన్నారు. కొంకర్లు తిరిగిన నల్లగొండను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ రకసిని పారదోలడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మంచినీళ్లు లేక ట్యాంకుల ద్వారా నీళ్లను సప్లయ్ చేసే స్థితి ఉండేదని వివరించారు. మినరల్ వాటర్ల ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నెల సుమారు రూ. 15 కోట్ల మంచినీళ్లు కొనుకునే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఈ కన్నీళ్ల కథ మార్చిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు.