కాంగ్రెస్ పార్టీ ధోకేబాజ్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనలను 58 ఏండ్లు ఏడిపించిండ్రు. 400 మందిని పిట్టల్లా కాల్చి చంపిండ్రు. లక్షల మందిని జైళ్లో పెట్టిండ్రు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు. 14 ఏండ్లు తెలంగాణ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి.. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇలాగైతే నడవదని తిరగబడి గుంజుకుంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గం అభ్యర్థి గంగుల కమలాకర్, చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థి రవిశంకర్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో, వడ్లు పండించడంలో దేశంలోనే నం.1 స్థానానికి తీసుకువచ్చినం. రాబోయే కొద్ది రోజుల్లో ఎప్పుడు నల్లా తిప్పితే అప్పుడు వచ్చేలా.. తెలంగాణలో 24గంటల పాటు నల్లా నీళ్లు స్కీం తెస్తున్నాం.
ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఎవడన్నా ఇచ్చిండా..? రైతులోకం సీరియస్గా ఆలోచించాలి. కాంగ్రెస్ హయాంలో సాగు నీటికి కటకట, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. వరద కాలువలో మోటర్ పెట్టుకుని నీళ్లు పారిచ్చుకుంటే మోటర్లు పీకి కాలువల ఎత్తేద్దురు. ఇయ్యాల మీ జోలికి ఎవడన్నా వత్తుండా.? వెయ్యి కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాంగ్రెసోడు ధరణి తీసేసి భూ భారతి తెస్తామని చెప్తున్నడు. ఇది కొత్తదేమి కాదు. 30, 40 ఏండ్ల కిందనే తెచ్చిండ్రు. గదే పైరవీకారులు, దళారీలు ఉండే. 24 గంటల కరెంటోడు కావాలా.? 3 గంటల కరెంటోడా..? రైతు బంధు ఇచ్చేటోడా..? రైతుబంధు వేస్ట్ అనేటోడా..? రైతులకు మేలు చేసేటోడా.. రైతులను కిందమీద చేసేటోడా..? ఎవరు కావాల్నో ప్రజలే నిర్ణయం తీసుకోవాలె.
ఎన్నికలు అనగానే మన దగ్గర గాడిద, గుర్రం ఒక్కటై పనిచేస్తయి. గెలువడానికి ఫాల్తు వాగ్దానాలు, దుర్మార్గమైన పనులు చేస్తరు. బీజేపీకి మతపిచ్చి తప్ప ఇంకోటి రాదు. ఇక్కడ ఉన్న ఎంపీకి సంస్కారం ఉన్నదా..? మాటలు, పద్ధతి ఏంది..? మసీదులు తవ్వుదామా.. గుళ్లు తవ్వుదామా..? మసీదులు తవ్వేటోడు సిపాయా ఈ దేశంలో.. సంస్కారం ఉన్నోడు చేసే పనేనా..? మతం పేరుతో కొట్లాట, తాకులాట పెట్టడం రాజకీయమా.? ఇలాంటోళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు. ఎటు పడితే అటు వేయకుండా.. పనిచేసే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో మీ కండ్లముందరే ఉన్నది. ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి. అని సీఎం కేసీఅర్ అన్నారు.