Talasani Srinivas Yadav | బేగంపేట, ఏప్రిల్ 13: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఈ నెల 27న ఘనంగా జరుపుకుందామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తలసాని పిలుపునిచ్చారు. 27 వ తేదీన ఉదయం 10 గంటలకు అన్ని డివిజన్లలలో తోరణాలు, జెండాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. అనంతరం వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌ను బలపర్చాలని కోరారు.
15 నెలల కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని తలసాని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి పేదలు ఫుట్‌పాత్‌లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.