మేడ్చల్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘స్వరాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి. ఆడబిడ్డల కష్టాలు తీరాయి. దూరంగా వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకొని తెచ్చుకోవడం పల్లె, పట్టణంలో ఎక్కడా కన్పించడం లేదు. ఇంజినీర్‌గా అవతారమెత్తి కేసీఆర్ చేసిన కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందజేసి దాహం తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని తెలిపారు. ఆదివారం మంచినీటి దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మహిళలు నీటితో అభిషేకం చేశారు.
జవహర్‌నగర్‌లో వేలాదిమంది మహిళలతో కలిసి మంత్రి మల్లారెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. మహిళలు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి బిందెలతో నీళ్లను తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. వారి బాధలను గుర్తించిన కేసీఆర్ కేవలం మూడేళ్ల కాలంలో ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేశారని తెలిపారు. ప్రపంచంలోనే ఎత్తైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుకున్న సమయానికి కంటే ముందే పూర్తి చేశారన్నారు. సీఎంఆర్ హాస్పిటల్ నుంచి కేసీఆర్ కూరగాయాల మార్కెట్ వరకు 500 మంది మహిళలు బిందెలతో ర్యాలీ నిర్వహించారు.