H City Project | సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1090 కోట్లతో స్టీల్ వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 299 ఆస్తులను స్థల సేకరణకు గుర్తించి, 112 ఆస్తులకు సంబంధించి మార్కింగ్ చేశారు.
స్థల సేకరణలో అడ్డంకులు తలెత్తడం…కొందరు భూ సేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించడంతో భూ సేకరణ ప్రక్రియ సాగలేదు. ప్రాజెక్టు పురోగతిలో ఉందని న్యాయస్థానంలో చెప్పుకొనే ప్రయత్నంలో భూసేకరణపై స్పష్టత లేకుండానే పనులకు సంబంధించి అధికారులు ఇటీవల టెండర్లను సైతం పిలిచారు. ప్రముఖ కంపెనీలు మెగా, కేఎన్ఆర్, ఎంవీఆర్లు పాల్గొన్నాయి. టెండర్ కమిటీ అర్హత కలిగిన కంపెనీకి పనులు అప్పగించాల్సిన తరుణంలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసే సాహసం చేయడం లేదు.
కేబీఆర్ పార్కు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రధానంగా అధికార పార్టీ మాజీ మంత్రి జానారెడ్డి, సినీ హీరో బాలకృష్ణ, మరో సినీ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి , ఇతర పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఖరీదైన స్థలాలు కావడంతో చాలా మంది స్థలాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇందులో ఇప్పటికే కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వాస్తవంగా ప్రాజెక్టు పనులు చేపట్టాలంటే ముందుగా భూ సేకరణ అత్యంత కీలకం. భూ సేకరణపై స్పష్టత వచ్చాకే పనులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించాలి.
కానీ ఇక్కడ భూసేకరణ అడ్డంకులను తొలగించకముందే టెండర్లు పిలిచి ….అంతేస్థాయిలో టెండర్ కమిటీ కాలాయాపన చేస్తుండడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. పురపాలక డిప్యూటీ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ విభాగం ఈఎన్సీ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్, జలమండలి డైరెక్టర్, ఫైనాన్స్ విభాగం సీనియర్ అధికారులతో కూడిన కమిటీ సమావేశంలో ఎజెన్సీ ఫైనల్ చేయాల్సి ఉంది. తర్వాత ఫైనాన్షియల్ బిడ్‌ను సైతం తెరిచి ఎజెన్సీ ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ టెక్నికల్ బిడ్లు తెరిచి 12 రోజులు కావొస్తున్న కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో ప్రాజెక్టు పనులు ప్రశ్నార్థకంగా మారింది.
దాదాపు రూ. 741 కోట్ల వరకు భూసేకరణకు ఖర్చు అవుతుందని, 56,621.30 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నట్లు అంచనా వేశారు. విరంచీ దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 6.50 కి.మీ పొడవు 100 ఫీట్ల నుంచి 120 ఫీట్ల వరకు రోడ్డు విస్తరించాలని నిర్ణయించి.. 81 ఆస్తులను సేకరించాలని భావించారు. కేబీఆర్ పార్కు ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ పరిధిలో 40, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ 47, మహారాజా అగ్రసేన్ జంక్షన్లో 34, ఫిలింనగర్లో 43, రోడ్డు నంబర్ 45లో 36, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్లో 18 ఆస్తులను సేకరించాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసులు పడుతుండడంతో ఆస్తుల సేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడం లేదు.