సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : సిటీ లంగ్ స్పేస్‌గా మారిన కేబీఆర్ జాతీయ పార్కు.. పాలకుల స్వార్థానికి, కాంట్రాక్టుల దాహానికి బలైపోతున్నది. వన్యప్రాణి సంరక్షణ చట్టలు, సుప్రీంకోర్టు తీర్పులు, నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న వికృత క్రీడలతో పర్యావరణ విధ్వంసమే చివరకు మిగులుతున్నది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జాతీయ పార్కుల పరిధిలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టంగా ఉంది. కానీ కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్లతో సాధారణ పార్కు పరిసరాల్లో వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు సర్కార్ పనులు మొదలెట్టింది. అడ్డుగా ఉన్న వందలాది చెట్లను నరికేయనుండగా, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన జోన్(ఈఎస్‌జడ్) ఉల్లంఘనలతో ఇక్కడి పర్యావరణ వ్యవస్థను కాలరాస్తోంది.
కేబీఆర్ వినాశనమే
అభివృద్ధి పేరిట వినాశాననానికి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హెచ్-సిటీని చెప్పుకోంటుంది. మౌలిక సదుపాయాల కల్పన పేరిట కేబీఆర్ పార్క్ మనుగడకే ముప్పు తీసుకువచ్చేలా వ్యవహారిస్తోంది. అడ్డు వస్తున్న ఎన్జీటీ ఆదేశాలను కూడా బుట్టదాఖలు చేస్తోంది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనీ ఎన్జీటీ పదేపదే హెచ్చరిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం పర్యావరణాన్ని బలి చేయాల్సిన అవసరం లేదనీ, ఈఎజ్జడ్ పరిధిలో ఫ్లైఓవర్లు, రహదారుల కోసం అనుమతులు లేకుండానే పనులు మొదలుపెడుతుందనే విమర్శలు ఉన్నాయి. చెట్ల నరికివేత కూడా అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం ఉల్లంఘనే అవుతుందనీ, జాతీయ పార్కు సమీపంలో పేలుళ్లు నిషేధమనే నిబంధనలు కూడా తుంగలో తొక్కి వ్యవహారిస్తోంది.
ఇది ఏకో సెన్సిటివ్ జోన్
గతంలోనే జాతీయ పార్కుల చుట్టూ 1 కిలోమీటర్ల పరిధిని ఏకో సెన్సిటివ్ జోన్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు, ఎన్జీటీ స్పష్టం చేశాయి. కనీసం ఆదేశాలను పట్టించుకోకున్నా.. పరిమితుల విషయంలో సర్కార్ పునరాలోచన చేయలేదు. రహదారుల విస్తరణ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ మరో కాంక్రీట్ జంగిల్‌ను నిర్మించేందుకు చర్యలు చేపడుతోందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.