సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కంటివెలుగు విజయవంతంగా సాగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచే స్థానికులు కంటి వెలుగు శిబిరాలకు చేరుకొని పరీక్షలు చేయించుకోవడం కనిపించింది. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 274 కేంద్రాల్లో కంటివెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు కంటే రెండో రోజు రోగుల సంఖ్య పెరిగింది. శుక్రవారం 41,954 మందికి కంటి పరీక్షలు జరిపిని వైద్యులు.. 15,113 మందికి రీడింగ్ గ్లాసెస్, 11,554 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
నగరంలో 115 కేంద్రాల్లో 15,053 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. వారిలో 5086 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేశామని, 4714 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
జిల్లా పరిధిలో 2వ రోజు 80కేంద్రాల ద్వారా 10,271మందికి కంటి పరీక్షలు జరిపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిలో 3800మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 3300 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేసినట్లు వివరించారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో 2వ రోజు 79 కేంద్రాల ద్వారా 16,630 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. వారిలో 6227 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 3540 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు.
సికింద్రాబాద్, జనవరి 20: పేదలకు వరంగా కంటి వెలుగు మారిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి గన్‌బజార్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పరీక్షల కోసం వచ్చిన స్థానికులను మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని అన్నారు. కంటి పరీక్షల కోసం ప్రైవేట్ వైద్యశాలలకు వెళితే రూ.500 అవుతాయని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉచితంగానే అన్ని పరీక్షలతో పాటు మందులు, అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లూ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజకుమారి, బీఆర్ఎస్ నేతలు నివేదిత, దేవులపల్లి శ్రీనివాస్, సదానంద్‌గౌడ్, సంతోష్‌యాదవ్, తేజ్‌పాల్, బాలరాజ్, ధన్‌రాజ్, ఆంజనేయులు, నరేష్, నర్సింహ ఉన్నారు.
రెండేండ్ల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్నా. హైకోర్టు దగ్గరలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ప్రతి నెల పరీక్షలు చేయించుకుంటే రూ.2 వేలు అయ్యేది. ప్రస్తుతం బస్తీలోని కంటి వెలుగు శిబిరం పెట్టారని తెలిసింది. పేరు రాయించుకొని వెళ్తే వివిధ పరీక్షలు చేసి కండ్లద్దాలు ఇచ్చారు. ఈ అద్దాలు బయట తీసుకుంటే రూ.2 వేలు ఖర్చయ్యేది. ఇక్కడ మాత్రం ఉచితంగా ఇచ్చారు.
– నిర్మలాసింగ్,గులాబ్‌సింగ్ బౌలి అద్దాలు బాగున్నాయి.
నాకు తలనొప్పి సమస్య ఉండేది. ఇంటి వద్ద ఉన్న ఓ డాక్టర్ వద్దకు వెళితే ఓ సారి కంటి డాక్టర్‌కు చూయించుకోవాలని చెప్పారు. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇంటి దగ్గర్లోని కంటి వెలుగు శిబిరం పెట్టారు. అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. కంటి అద్దాలు ఇచ్చారు. ఎంతో బాగున్నాయి.
– పుష్పలత, అమీర్‌పేట
ఐదారు నెలల నుంచి కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా. ఇంట్లోని పనులు చేసుకోలేక పోతున్నా. కంటి వెలుగు శిబిరాలను బస్తీల్లోనే ఏర్పాటు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. ఒకే దగ్గర అన్నీ పరీక్షలు చేశారు. వెంటనే అద్దాలు ఇచ్చారు. ఇదే ప్రైవేట్ ఆస్పత్రికి పోతే పరీక్షల కోసం రెండు మూడు రోజులు ఎదురు చూడాలి. ఆ తర్వాత అద్దాలకు ఆర్డరియ్యాల్సి వచ్చేది.
– సత్యవేణి, లాల్‌దర్వాజ
ఎన్నో ఏండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నా. బస్తీలో ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకొని కండ్లద్దాలు తీసుకున్నా. ఇప్పుడు అంతా బాగుంది. నాకు చూపునిచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కంటి వెలుగుపై బస్తీలోని ప్రతిఒక్కరికి తెలియజేస్తా.
– వినోద, భవానీనగర్ కాలనీ
కంటి వెలుగు ఎంతో బాగుంది. నాకు కొద్దిగా కంటి సమస్య ఉండేది. ఎన్నో రోజులుగా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నా. అంతలోనే కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు చేస్తున్నారని తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చా. ఎంతో అనుభవమున్న డాక్టర్లు అవసరమైన అన్ని పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు ఇచ్చారు.
నేనో ప్రైవేట్ ఉద్యోగిని. ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పని చేస్తుండటంతో కంటి చూపు తగ్గింది. ఓ సారి ఎల్వీప్రసాద్కు వెళ్లా. అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. ఓ వేళ దొరికినా రోజు మొత్తం వేచి చూడాల్సి వస్తుందని అక్కడ ఉన్నవారు చెప్పారు. కంటి వెలుగు శిబిరాలు పెట్టి పరీక్షలు చేస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చా. మొదట్లో కొంత అనుమానం ఉండే. పరీక్షలకు పోవాలా వద్దా? అని ఆలోచించా. ధైర్యం చేసి ఇక్కడ పరీక్షలు చేయించుకున్నా. నా భయం పటాపంచలు అయ్యింది. ఎంతో బాగా పరీక్షలు చేశారు. సైట్ ఉందని అద్దాలు వాడమన్నారు. అవి కూడా ఉచితంగానే ఇస్తామన్నారు. థ్యాంక్స్ టూ తెలంగాణ గవర్నమెంట్.