మన్సూరాబాద్, ఫిబ్రవరి 15: కంటి వెలుగు పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకం పట్ల ప్రజలు తమ హర్షాన్ని వెలిబుచ్చుతున్నారు. కంటి వెలుగు కేంద్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. కంటి పరీక్షల కోసం ఉదయం 8 గంటల నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి భవానీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రానికి విచ్చేస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భవానీనగర్ కాలనీలోని కంటి వెలుగు కేంద్రంలో బుధవారం 111 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 19 మందికి అద్దాలు ఇవ్వగా.. మరో 14 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చారు. పది రోజుల్లో 14 మందికి అవసరమైన అద్దాలను తయారు చేయించి ఇవ్వబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
కంటి వెలుగు పరీక్షా కేంద్రం సహారాస్టేట్స్కాలనీకి తరలింపు
మన్సూరాబాద్ డివిజన్ భవానీనగర్ కాలనీలో నెల రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని సహారాస్టేట్స్కాలనీకి తరలిస్తున్నారు. సహారాస్టేట్స్కాలనీలోని శ్రీలలితా నాగలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోని కమ్యూనిటీ హాల్లో గురువారం నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సూపర్వైజర్ రవికుమార్ తెలిపారు. కంటి వెలుగు కేంద్రం ఇక నుంచి భవానీనగర్ కాలనీలో అందుబాటులో ఉండదని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునే వారు సహారాస్టేట్స్ కాలనీకి రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి వెలుగు పరీక్షా కేంద్రం కొనసాగుతుందని తెలిపారు. శనివారం, ఆదివారం, పబ్లిక్ హాలిడేస్‌లో కంటి వెలుగు కేంద్రానికి సెలవు ఉంటుందని పేర్కొన్నారు. కంటి పరీక్షల కోసం వచ్చే వారు తమ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు.