ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: రాష్ట్రంలో వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని టీఎస్‌జేఏసీ వ్యవస్థాపకుడు మన అశోక్‌యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీనిని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సిద్ధరామయ్య సమక్షంలో విడుదల చేశారన్నారు. అందులో పేర్కొన్న విధంగా అసెంబ్లీలో వెంటనే కులగణన బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బైక్‌ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా అశోక్‌యాదవ్ మాట్లాడుతూ.. కులగణన విధి విధానాల కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, బీహార్‌లో జరిగిన విధంగా కులగణనతో కూడిన జనగణను ఆదర్శంగా తీసుకుని సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విద్యార్థి నాయకులు లింగం, రాంబాబు, వీరు, చంద్రశేఖర్, వీరేంద్ర, శేఖర్, శ్రవణ్, శరత్, లెనిన్, గణేశ్, వెంకటేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.