సిటీబ్యూరో/ బాలానగర్/ కేపీహెచ్బీకా లనీ/ మూసాపేట జూలై 10 (నమస్తే తెలంగాణ): కల్తీ కల్లు ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం మధ్యాహ్నం మరోకరు ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అయితే కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురైన వారిలో కొందరి వివరాలు మాత్రమే అధికారులు ప్రకటిస్తున్నారు. బాలానగర్ ఆబ్కారీ స్టేషన్ పరిధిలోని 5 కల్లు దుకాణాలలో ఈనెల 7న దాదాపు 200 నుంచి 300మ ంది వరకు కల్లు సేవించి ఉంటారని, వారిలో ఇప్పటికే 100మందికి పైగా ఆయా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఇప్పటి వరకు 38 మందిని గుర్తించి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వారు కూకట్పల్లి, బాలానగర్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
కల్తీ కల్లు ఘటనలో సంభవిస్తున్న మరణాలపై ఇప్పటి వరకు ఆబ్కారీ అధికారులు నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అస్వస్థతకు గురైన వారి సంఖ్యలోనూ దాపరికం ప్రదర్శిస్తున్న అధికారులు మృత్యువాత పడుతున్న సమాచారాన్ని పూర్తిగా బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతున్నా అధికారులు గాని, ప్రభుత్వం గాని స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ కల్లు ఘటనలో గురువారం మరో మహిళ మృత్యువాత పడింది. కూకట్‌పల్లిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన నర్సమ్మ(54) ఈనెల 7న బాలానగర్ పరిధిలోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి.. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స కోసం బాధితురాలిని ఎర్రగడ్డ ఈఎస్ఐ దవాఖానకు తరలించగా ,చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. దీంతో కల్తీ కల్లు మరణాల సంఖ్య 7కు చేరింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు కల్లు దుకాణాల నిర్వాహకులు కల్లులో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని కలిపి కల్తీకి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో ఆలస్యంగానైనా కండ్లు తెరిచిన స్థానిక ఆబ్కారీ అధికారులు ఎట్టకేలకు కల్తీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టుచేసి, నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేశారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ షేక్ ఫయాజ్ఉద్దీన్, సహాయ సూపరింటెండెంట్ మాధవయ్య మాట్లాడుతూ బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 22 కల్లు కాంపౌండ్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో హైదర్‌నగర్, హైదర్‌నగర్ అనుబంధ షాపు, ఎస్పీనగర్ ఇందిరానగర్, భాగ్యనగర్ కల్లు కాంపౌండ్లలో నమూనాలు సేకరించి, రీజినల్ కెమికల్ ల్యాబ్‌లో పరీక్షించగా, సదరు కల్లు దుకాణాల్లో ఆల్ఫాజోలం కలిపినట్లు నిర్ధారణ జరిగిందని వెల్లడించారు.
ల్యాబ్ నివేదిక ఆధారంగా హైదర్‌నగర్, దాని అనుబంధ షాపు, ఎస్పీ నగర్, ఇందిరా నగర్ నాలుగు కల్లు దుకాణాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా హైదర్ నగర్ కల్లు దుకాణం నిర్వాహకుడు కూన రవితేజ గౌడ్, హైదర్ నగర్ అనుబంధ కల్లు దుకాణం నిర్వాహకుడు సీహెచ్ నగేశ్ గౌడ్, ఎస్పీ నగర్ కల్లు దుకాణం నిర్వాహకులు కూన సాయి తేజ గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కల్లులో ఆల్ఫాజోలం కలిపినట్లు అంగీకరించారని అధికారులు తెలిపారు. ఈ మేరకు కల్లు దుకాణాల నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఈఎస్ వెల్లడించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని పలు కల్లు దుకాణాలలో జోరుగా ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేడ్(సీహెచ్) వంటి ప్రాణాంతక నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నా ఆబ్కారీ అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రికార్డుల్లో చూపించడం కోసం తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం, ఒకవేళ ఎక్కడైనా మత్తు పదార్థాలు కలిపినట్లు నిర్ధారణ జరిగితే నామమాత్రంగా కేసు నమోదు చేసి, రెండు రోజుల పాటు సదరు కల్లు దుకాణాన్ని మూసివేయడం, మూడోరోజు మళ్లీ తెరిపించడంలో కొందరు అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
బాలానగర్ పరిధిలోని పలు కల్లు దుకాణాల్లో జోరుగా మత్తు మందు కల్పుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే బాలానగర్ ప్రాంతంలో కల్లు దుకాణాల నిర్వాహకులు యథేచ్ఛగా ఆల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలతో కల్తీకల్లు విక్రయించి 7మంది ప్రాణాలను బలితీసుకున్నట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్, దాని పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కల్తీ కల్లు దుకాణాల నుంచి సంబంధిత ఎక్సైజ్, పోలీసు స్టేషన్‌కు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది నుంచి కొందరు అధికారుల వరకు లక్షల్లో మామూళ్లు అందుతున్నాయని, ఈ క్రమంలోనే గత ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కేసులు నమోదై, సస్పెన్షన్‌కు గురైన 51కల్లు దుకాణాలను యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో ఎక్కడైనా మరణాలు సంభవిస్తే తప్ప అక్కడి అధికారులు మత్తు నుంచి తేరుకునే పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు.