గోల్నాక, జూలై 24: హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎప్పటికీ మరవలేమని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను అంబర్‌పేట పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం అంబర్‌పేట డివిజన్ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు. సుమారు వంద మంది బాలింతలు, శిశువులకు ఉపయోగ పడే బెడ్, దోమతెర, సబ్బులు, పౌడర్, న్యాప్కిన్, తువ్వాళ్లు తదితర రకాల వస్తువులతో కూడిన బేబీ కిట్లను అందజేశారు.
అనంతరం పటేల్‌నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలసి కేటీఆర్ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. కేటీఆర్ హైదరాబాద్ మహా నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ప్రపంచంలోని గొప్ప నగరాల జాబితాలో చేర్చారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో కేటీఆర్ చేసిన కృషిని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్‌తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.