బంజారాహిల్స్, ఫిబ్రవరి 18 : కాకతీయ సంస్కృతితో పాటు చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాకతీయుల కాలం నాటి నాణేల చరిత్రను, వాటి ప్రాధాన్యతను వివరిస్తూ ప్రముఖ నాణేల అధ్యయన నిపుణులు డా.రాజిరెడ్డి రచించిన ‘ కాకతీయ కాయిన్స్’ పుస్తకాన్ని మంత్రి హరీశ్‌రావు శనివారం బంజారాహిల్స్ రోడ్ నం 4లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో 46 వేలకు పైగా చెరువులకు ప్రాణం పోయడం ద్వారా కాకతీయ రాజ్య పాలకులకు ఘనంగా నివాళి అర్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ట్రస్ట్ నిర్వాహకులు బీవీ పాపారావు తదితరులు పాల్గొన్నారు.