Kacheguda | సిటీబ్యూరో/కాచిగూడ, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మూడునెలల బాబు కిడ్నాప్ అయిన ఐదు గంటల్లోపే కాచిగూడ పోలీసులు కేసును ఛేదించారు. ఆ చిన్నారిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్‌కు సంబంధించిన కేసు వివరాలు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. వనపర్తి ప్రాంతానికి చెందిన రవి, వరలక్ష్మి దంపతులు వృత్తిరీత్యా భిక్షాటన చేస్తూ ఉప్పుగూడలో నివాసముంటున్నారు. గౌలిగూడ ప్రాంతానికి చెందిన బోగ నర్సింగరాజు అనే వ్యక్తి పంజాగుట్టలోని ఓ హాస్పిటల్లో ఎక్స్‌రే టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఎవరికైనా పిల్లలు లేని వారికి చిన్నపిల్లలు కావాలంటే తనను సంప్రదించాలంటూ తన బంధువులైన కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్, ఉమాదేవిలకు నర్సింగరాజు చెప్పాడు. దీంతో ఉమాదేవి తనతో పాటు క్లాత్స్టోర్స్లో పనిచేసే సంధ్యారాణికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఈ విషయం చెప్పింది. తనకు పిల్లాడు కావాలని చెప్పడంతో రాఘవేందర్ నర్సింగరాజు దగ్గరికి తీసుకెళ్లి అడగగా.. ఒక పిల్లాడు ఉన్నాడని, అతడిని తల్లిదండ్రులు దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో ఆమె ఆ పిల్లాడిని తీసుకోవడానికి ఒప్పుకున్నది. ఇందుకోసం తమకు 1.5లక్షలు ఇవ్వాలని నర్సింగరాజు చెప్పగా 6 నెలల కిందట సంధ్యారాణి రూ.లక్ష ఇచ్చింది.
ఆ తర్వాత పిల్లల కోసం నర్సింగరావు వెతుకుతుండగా.. సోమవారం మధ్యాహ్నం కాచిగూడ క్రాస్‌రోడ్స్ వద్ద చాదర్‌ఘాట్ ఫుట్‌పాత్‌పై వరలక్ష్మి అనే మహిళ చిన్నపిల్లాడితో భిక్షాటన చేస్తూ కనిపించింది.ఆమెను మాటల్లో పెట్టి ఆమె కొడుకుకు బట్టలిప్పిస్తానని చెప్పి వారిద్దరిని డిమార్ట్‌కు తీసుకెళ్లిన నర్సింగరాజు అక్కడ వరలక్ష్మి డ్రెస్ చూస్తుండగానే ఆమె కొడుకును తీసుకొని పారిపోయి లాల్‌దర్వాజలో ఉన్న సంధ్యారాణికి ఇచ్చాడు. ఆ సమయంలో సంధ్యారాణి నర్సింగరాజుకు తమ ఒప్పందం ప్రకారం ముప్పైవేలు ఇచ్చి మరో రూ.20వేలు రెండురోజుల్లో ఇస్తానని చెప్పింది. తన కొడుకును ఎత్తుకెళ్లారంటూ వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి డిమార్ట్ నుంచి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గమనించి నర్సింగరాజును గౌలిగూడలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సంధ్యారాణి దగ్గర నుంచి చిన్నారిని తీసుకొని అతడి తల్లి వరలక్ష్మికి అప్పగించారు. నర్సింగ్‌రాజ్, రఘవేందర్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, ఉమాదేవి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామిలతో పాటు అడిషనల్ డీసీపీ నర్సయ్య, కాచిగూడ ఏసీపీ రఘుల పాల్గొనగా.. కేసును కేవలం ఐదుగంటల్లో ఛేదించిన కాచిగూడ సీఐ చంద్రకుమార్, ఎస్ఐలు సుభాష్, రవికుమార్, క్రైం పోలీసులు శివ, శ్రీకాంత్, అర్జున్, అశోక్‌ల బృం దాన్ని ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు అందజేశారు.