సైదాబాద్, డిసెంబర్ 13: తెలిసీ తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్‌లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సత్ప్రవర్తన కలిగిన వారికి జువైనల్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. 18 ఏండ్లు నిండిన తర్వాత విడుదలైన వారు తలెత్తుకొని తిరిగేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. జువైనల్ చరిత్రలో ఎక్కడాలేని విధంగా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్, పెట్రోల్ బంకు నిర్వహణ, చేనేత వస్ర్తాల తయారీ, వడ్రంగి, డ్రైవింగ్ స్కూల్, పాడిపరిశ్రమలు ఇలా అనేక అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. తెలంగాణ జైళ్లశాఖ పెట్రోల్ బంక్‌ల నిర్వహణలో సక్సెస్ కావటంతో అదే దారిలో జువైనల్ డిపార్టుమెంట్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోని జువైనల్ స్పెషల్ హోమ్ ఆవరణలో మొట్టమొదటి సారిగా పైలట్ ప్రాజెక్టు కింద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అత్యాధునిక వసతులతో పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నారు.
పెట్రోల్ బంక్ ఏర్పాటు జువైనల్ డిపార్టుమెంట్‌కు బంగారు బాతుగా మారనున్నది. ప్రతి రోజు 10 వేల లీటర్ల డీజిల్, 3 వేల లీటర్ల పెట్రోల్ విక్రయించే అవకాశం ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. దీంతో ఏడాదికి రూ.కోటి 10 లక్షల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా 20 సంవత్సరాల బంక్ స్థలం లీజుకుగాను రూ.2 కోట్లు ఆదాయం రానున్నది. అయితే ఇక్కడ 16 మంది చిన్నారులకు ఉపాధి కల్పించి ప్రతి నెల 16వేల వేతనం ఇవ్వనున్నారు.
పెట్రోల్ బంక్, ఆర్చరీ సెంటర్‌తోపాటు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని జువైనల్ వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేస్తాం. హోమ్ నుంచి విడుదలైన చిన్నారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి నిధులను వినియోగిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జువైనల్ పెట్రోల్ బంక్, జేజేబీ భవనం, అబ్జర్వేషన్ హోమ్, డీఎల్వో ఆఫీస్, డ్రైవింగ్ స్కూల్‌ను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి మూడు ఎకరాల స్థలం మంజూరు చేయాలని కమిషనర్ దివ్య ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ ప్రభుత్వ జువైనల్ డిపార్టుమెంట్లో కొనసాగుతున్న సంస్కరణలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయటానికి అధ్యయనం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ చిన్నారుల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. బాలుర సదనాలకు వచ్చే చిన్నారులను ఉత్త మ ప్రయోజకులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
– డాక్టర్ మిర్జా రజా అలీబేగ్, డిప్యూటీ డైరెక్టర్ (జువైనల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్)