Justice Chandrakumar | ఖైరతాబాద్, మే 14 : చత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చర్చలకు తాము సిద్దమంటూ మావోయిస్టులు ప్రకటించినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రకటన విడుదల చేసిన నెల రోజుల పరిధిలో 22 మంది ఆదివాసీలు, ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు, 15 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇద్దరు ఎస్సైలు తీవ్రంగా గాయపడ్డారన్నారు.
శాంతి చర్చలకు వస్తామని ప్రకటించిన వెంటనే కేంద్రం స్పందించి ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదన్నారు. పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతో చర్చలు జరుపుతున్నారని, గోర్కా, బోడో ల్యాండ్ లాంటి సాయుధ తిరుగుబాటుదారులతో శాంతి చర్చలు నిర్వహించారని, వారిపై కేసులు కూడా రద్దు చేశారని, అయితే దేశంలో అంతర్భాగమైన వారితో ఎందుకు జరుపడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం చేస్తున్నామంటున్న కేంద్రం మావోయిస్టుల ప్రభావం లేని ఆదివాసీ ప్రాంతాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే చర్చలకు పిలువాలని, ఆదివాసీ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని కోరారు. ఈ సమావేశంలో శాంతి చర్చల కమిటీ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి, సభ్యులు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జైసింగ్ రాథోడ్, న్యాయవాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.