సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న రెండో జాబితా రానే వచ్చింది. రావడం రావడమే.. హైదరాబాద్ మహా నగర పరిధిలో పెద్ద ఎత్తున చిచ్చును రాజేసింది. ప్రధానంగా కీలకమైన స్థానాల్లో ప్యారాచూట్ నేతలకు పెద్దపీట వేయడంతో అసంతృప్తులు రగిలిపోతున్నారు. జాబితా రాత్రి రావడంతో అసమ్మతి నేతలు ప్రస్తుతానికి మాటల తూటాలు మాత్రమే పేలుస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి శనివారం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న రెండో జాబితా రానే వచ్చింది. రావడం రావడమే… హైదరాబాద్ మహా నగర పరిధిలో పెద్ద ఎత్తున చిచ్చును రాజేసింది. ప్రధానంగా కీలకమైన స్థానాల్లో ప్యారాచూట్ నేతలకు పెద్దపీట వేయడంతో అసంతృప్తులు రగిలిపోతున్నారు. జాబితా రాత్రి రావడంతో అసమ్మతి నేతలు ప్రస్తుతం మాటల తూటాలు మాత్రమే పేలుస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి శనివారం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఉదయపూర్ తీర్మానాన్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. మైనంపల్లి విషయంలో తుంగలో తొక్కి.. పీజేఆర్ వారసుల విషయంలో మాత్రం అమలు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు పీజేఆర్ అభిమానులను సైతం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సీటుకు నోటుతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం స్థానంలో అధిష్ఠానం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్ ఇస్తే పరువు పోతుందని గుర్తించి.. తాను పోటీ చేయనని మొండికేసిన కేఎల్‌ఆర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి టికెట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. రెండో జాబితాలో మహా నగర పరిధిలోని పది నియోజకవర్గాలు ఉండగా… వాటిలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, అంబర్‌పేట, జూబ్లీహిల్స్ స్థానాల్లో పెద్ద ఎత్తున అసమ్మతి వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ మహానగర పరిధిలోని 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 17 మంది పేర్లు ఉండగా… శుక్రవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో పది స్థానాలను ప్రకటించారు. పాతబస్తీలోని చార్మినార్ స్థానానికి మాత్రం అభ్యర్థి పేరును పెండింగులో ఉంచారు. కాగా, మొదటి జాబితాలో ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున అసంతృప్త నేతలు బయటికి వచ్చారు. పాతబస్తీలోని బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసాయి. ఏకంగా గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని సైతం చించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పాటు ఉప్పల్‌కు చెందిన అసంతృప్త నేతలు రేవంత్‌పై భారీ ఎత్తున ఆరోపణలు చేసి, భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేయాలంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన నేతలందరూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. కాగా, శుక్రవారం రాత్రి విడుదలైన రెండో జాబితాలోనూ ఈ కోవకు చెందిన అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. కాకపోతే.. రాత్రివేళ కావడంతో అసంతృప్తులు బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేయలేదు. కానీ, అనేకచోట్ల టికెట్ ఆశించి, భంగపడిన వారు పార్టీని వీడుతామని కొందరు, బరిలో నిలిచి కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని మరికొందరు హెచ్చరికలు జారీ చేశారు.
సీనియర్లకు చెక్ పెట్టిన రేవంత్…
రెండో జాబితాలో ప్రధానమైన స్థానాల్లోని అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే… పార్టీని నమ్ముకొని, దశాబ్దాలుగా సేవ చేసిన సీనియర్లకు రేవంత్‌రెడ్డి చెక్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సీనియర్ బీసీ నేత వి. హనుమంత రావు పట్టుబట్టిన రెండు స్థానాల్లోనూ రేవంత్ తాను అనుకున్న వారికి టికెట్ ఇప్పించుకోవడం ఆయనను అవమానించడమేనని వీహెచ్ అభిమానులు అంటున్నారు. ఉదయపూర్ తీర్మానం మేరకు కుటుంబంలో రెండు టికెట్లు ఇచ్చేదిలేదని తొలుత కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. కానీ, మైనంపల్లి విషయంలో మాత్రం ఆ తీర్మానానికి నీళ్లొదిలారు. అయితే, పీజేఆర్ వారుసుల విషయంలో మాత్రం రేవంత్ ఆ తీర్మానాన్ని అడ్డుపెట్టి విష్ణువర్ధన్ రెడ్డికి చెక్ పెట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీకి సేవ చేస్తున్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని వీహెచ్ కూడా పట్టుబట్టినట్లు తెలిసింది. కానీ, విష్ణుకు చెక్ పెట్టి, ఆ స్థానంలో మాజీ క్రికెటర్ అజారుద్దిన్‌కు టికెట్ ఇప్పించేందుకు రేవంత్.. ఖైరతాబాద్‌లో విష్ణు సోదరి విజయారెడ్డికి టికెట్ ఇప్పించారు. అక్కడ తన అనుచరుడు రోహిన్‌రెడ్డిని కాదని విజయారెడ్డికి టికెట్ ఇప్పించినా… రోహిన్‌రెడ్డికి అంబర్‌పేట నుంచి అవకాశం ఇప్పించారు. అయితే, అంబర్‌పేటలో ఎప్పటినుంచో వీహెచ్ తన అనుచరుడు లక్ష్మణ్‌యాదవ్‌కు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2018లోనే పొత్తులో భాగంగా టీజేఎస్‌కు త్యాగం చేసినందున ఈసారి న్యాయం చేయాలని కూడా కోరారు. కానీ, రేవంత్ మాత్రం అటు విష్ణుకు చెక్ పెట్టి… ఇటు వీహెచ్ అనుచరుడికి చెక్ పెట్టి రెండుచోట్లా వీహెచ్ మాట నెగ్గకుండా అడ్డుపడినట్లు విశ్వసనీయ సమాచారం.
కుతకుతలాడుతున్న నేతలు…
కాంగ్రెస్ రెండో జాబితా వెలువడగానే మహా నగర పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు రగిలిపోతున్నారు.
విష్ణు’ దారెటు: పీజేఆర్ వారసుడిగా విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ, పార్టీ అధిష్ఠానం మాత్రం ప్యారాచూట్ నేత , మాజీ ఎంపీ, క్రికెటర్ అజారుద్దీన్‌కు ఖరారు చేసింది. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వడం పట్ల పీజేఆర్ అభిమానులు, విష్ణు అనుచరులు పెద్ద ఎత్తున అగ్రహంతో రగిలిపోతున్నారు. తనకు టికెట్ రాకపోవడం వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధానమని, నాపై కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే నాకు టికెట్ దక్కకుండా చేశాడంటూ విష్ణువర్ధన్‌రెడ్డి తన అనుచరుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు విష్ణు వర్ధన్‌రెడ్డి సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కూకట్పల్లి ‘కాక’ రేపుతున్న ‘నాన్‌లోకల్’: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గొట్టిముక్కల వెంగళరావు, గొట్టి ముక్కల పద్మారావు, సత్యంశ్రీరంగం, నాగిరెడ్డి, గాలి బాలాజీతో పాటు 14 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాన్ లోకల్‌కు కేటాయిస్తే సహకరించేదే లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించి బహిరంగంగా ప్రకటించారు. వెంగళరావు, సత్యంశ్రీరంగంతో పాటు స్థానిక నేతలంతా మూకుమ్మడిగా సహకరించేదే లేదని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం లోకల్ కాంగ్రెస్ లీడర్ల హెచ్చరికలను పక్కనపెట్టి స్థానికేతరులైన బండి రమేశ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో గొట్టి ముక్కల వెంగళరావు పార్టీకి రాజీనామా చేయనున్నారని తెలిసింది. శనివారం అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారని సమాచారం.
రాజేంద్రనగర్‌లో భగ్గుమన్న అసమ్మతి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కస్తూరి నరేందర్‌ను అధిష్ఠానం ప్రకటించడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంది. పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వచ్చిన తమను కాదని, డబ్బులు వెదజల్లి టికెట్ తెచ్చుకున్నారని ఆశావహులు మండిపడుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మణికొండ, నార్సింగి మునిసిపాలిటీల్లో పరిచయం ఉంది తప్పా, మిగతా ప్రాంతాల్లో ఆయనకు గుర్తింపే లేదని ఆరోపణలు చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన వారిలో బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వేణు గోపాల్, గౌరి సతీష్ ఉన్నారు. బుర్ర జ్ఞానేశ్వర్ ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
శేరిలింగంపల్లిలో చిచ్చు..: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జరిపేటి జైపాల్ యాదవ్ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీ తనను మోసం చేసిందని, పార్టీ మారనున్నట్టు, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగదీశ్వర్ గౌడ్‌కు కేటాయించడంతో పార్టీ టికెట్ ఆశించిన జెరిపేటి జైపాల్ యాదవ్‌తో పాటు రఘునాథ్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీపై ఎంతో నమ్మకంతో ఉంటే ఇతర పార్టీ నుంచి వచ్చి చేరిన వారికి టికెట్ ఇవ్వడం ఏమిటని జైపాల్ యాదవ్ మండిపడ్డారు. తమను గుర్తించని పార్టీలో ఉండే ప్రసక్తి లేదని, త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని జైపాల్ యాదవ్ స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో సర్వే సత్యనారాయణ, పిడమర్తి రవి, శ్రీగణేశ్ ప్రధానంగా ఉన్నారు. వీరిని కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ కేటాయించారు. దీంతో ఆశావహులంతా రేవంత్‌పై ఆగ్రహంతో ఉన్నారు.
ఎల్బీనగర్లో ప్యారాచూట్ నేత మధుయాస్కీగౌడ్కు అధిష్ఠానం టికెట్ ఖరారు చేసిందని ఆరోపిస్తూ ఇప్పటి వరకు టికెట్ తమకే వస్తుందనే ఆశలో ఉన్న వారంతా నిరాశలో ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రాంమోహన్‌గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. టికెట్ ఆశించిన మల్రెడ్డి రాంరెడ్డి, జెక్కిడి ప్రభాకర్‌రెడ్డి తదితరులు భంగపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా ఉన్నానని, తనను కాదని మధుయాస్కీకి టికెట్ ఖరారు చేయడంపై జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమంటూ సహచరులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు తెలిసింది.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. తనను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందంటూ వాపోయారు. అలాగే, పార్టీ టికెట్ ఆశించిన రంగారెడ్డి డీసీసీ చల్లా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు నిరాశకు గురయ్యారు. వీరు ప్యారాచూట్ నేత కేఎల్ఆర్కు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే.
ఇబ్రహీంపట్నం నుంచి దండెం రాంరెడ్డి, నిరంజన్‌రెడ్డి టికెట్ ఆశించారు. కానీ, మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఈ ఇద్దరూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా… తాను పోటీలో ఉంటానని దండెం రాంరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
ప్యారాచూట్ నేతలకే అందలం…
కాంగ్రెస్ రెండో జాబితాలో అప్పటికప్పుడు నియోజకవర్గానికి వచ్చి టికెట్ తన్నుకుపోయిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ వారసుడు విష్ణు టికెట్ ఆశించారు. దశాబ్దాలుగా ఆయన పార్టీని నమ్ముకొని ఉండగా.. రేవంత్‌రెడ్డి ప్యారాచూట్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దిన్‌ను రంగంలోకి దింపి విష్ణుకు నిరాశే మిగిల్చారు. ఎల్బీనగర్లోనూ అనేక మంది స్థానికులు టికెట్ ఆశించగా… అక్కడ ప్యారాచూట్ నేత మధుయాష్కీకి అవకాశం ఇచ్చారు. మహేశ్వరంలో రంగారెడ్డి డీసీసీతో సహా ఐదారుగురు స్థానిక నేతలు టికెట్ ఆశించగా.. రాత్రికి రాత్రి అక్కడ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. కూకట్‌పల్లిలో కూడా చాలా మంది స్థానిక నేతలు టికెట్ ఆశిస్తే… బండి రమేశ్‌కు హఠాత్తుగా టికెట్ ఇచ్చి పంపుతున్నారు. అంబర్పేటలోనూ నలుగురి వరకు స్థానిక నేతలు టికెట్ ఆశించగా… రేవంత్ అనుచరుడు రోహిన్‌రెడ్డికి అంబర్‌పేట టికెట్ ఇచ్చారు. ఇలా కీలకమైన స్థానాల్లో పార్టీని నమ్ముకున్న స్థానిక నేతలకు మొండిచెయ్యి ఇచ్చి.. ప్యారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది.