Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్ సర్కిల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. జూబ్లీహిల్స్ పరిధిలో 105.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. శ్రీనగర్ కాలనీలో 73 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఖాజాగూడ ఏరియాలో 96 మి.మీ. వర్షపాతం, మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్‌లో 68.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతేనే ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.
ఈ భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకొరిగిన భారీ వృక్షాలను రోడ్లపై నుంచి తొలగించారు. చాలా ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.