బంజారాహిల్స్, అక్టోబర్ 11: ఇల్లు ఖాళీ చేయాలని కోరిన వృద్ధురాలైన డాక్టర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న త్రండీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్ఆర్నగర్లో నివాసముంటున్న ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు గంటా కుసుమకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 7లోని ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో ఇల్లు ఉంది. ఆ ఇంటిని 2011లో రాఘవేంద్రనాథ్, అతడి తండ్రి రవీంద్రనాథ్‌కు అద్దెకు ఇచ్చారు.
2019లో రెంటల్ అగ్రిమెంట్ గడువు ముగియగా.. సొంతింట్లోకి రావాలని భావించిన డాక్టర్ కుటుంబ సభ్యులు ఇల్లు ఖాళీ చేయాలని కోరారు. అయితే ఏదో ఒక కారణం చెబుతూ మూడేండ్లుగా ఇంటిని ఖాళీ చేయకపోగా.. అద్దె ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 8న డాక్టర్, ఆమె కుటుంబ సభ్యులు మరోసారి రాఘవేంద్రనాథ్‌ను కలిసి ఇంటిని ఖాళీ చేయాలని కోరగా.. వారు తీవ్ర పదజాలంతో వారిని దూషించారు. మరోసారి ఇంటికి వస్తే అంతుచూస్తానంటూ బెదిరించారు. బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాఘవేంద్రనాథ్, రవీంద్రనాథ్‌పై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. నిందితులపై గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నం. 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీకి సంబంధించిన పార్కు స్థలాన్ని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.