బంజారాహిల్స్, సెప్టెంబర్ 16: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రేసులోంచి తప్పించామన్న ఆనందం కొన్ని రోజుల ముచ్చటగా మిగిలింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్లు ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. దీనికి తోడు సీనియార్టి అంశాన్ని తెరపైకి తెచ్చి ఇప్పటికే పోటీలో ఉన్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో అంజన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలియడం కలకలం సృష్టించింది.
అంజన్న రావాలి.. అంజన్న కావాలి ..అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ నేతలు, ప్రజలు అంటూ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వేయడంతో కార్యకర్తల్లో గందరగోళం మరింత నెలకొంది. తనకంటే సీనియర్‌కు టికెట్ ఇస్తే తాను టికెట్ అడగనని, అలా కాకుండా కొత్తవారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే తన వర్గం నేతలతో అంజన్ కుమార్ యాదవ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.