సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి నోడల్ అధికారులతో ప్రాథమిక సన్నాహక సమావేశం నిర్వహించారు.
మ్యాన్ పవర్, ఈవీఎం, వీవీ ప్యాట్ రవాణా, శిక్షణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రవరనా నియమావళి, శాంతి భద్రతలు, వల్నరబులిటీ మ్యాపింగ్, జిల్లా సెక్యూరిటీ ప్లాన్, వ్యయ పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్, ఫిర్యాదుల పరిషారం, లైవ్ వెబ్ కాస్ట్, ఎస్ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్, స్వీప్ యాక్టివిటీస్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సన్నద్ధతను సంబంధిత నోడల్ అధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లను మ్యాన్‌పవర్ జాబితాలో ఉండకుండా చూడాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాల కోసం ఈవీఎం, వీవీప్యాట్లను సిద్ధం చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. స్వీప్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్లను సైతం స్వీప్ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు.
మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నోడల్ అధికారులు తమ విధులు నిర్వర్తించాలని కమిషనర్ తెలిపారు. వారం రోజుల తర్వాత మరోసారి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్ రెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ బోర్ఖడే, రవి కిరణ్, అదనపు కమిషనర్లు అలివేలు మంగతాయారు, కె.వేణు గోపాల్, గీతా రాధిక, విజిలెన్స్ ఏఎస్పీ సుదర్శన్, సీవీఓ డాక్టర్ అబ్దుల్ వకీల్, తదితరులు హాజరయ్యారు.