జూబ్లీహిల్స్, జూన్ 23: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఓటరు దరఖాస్తుల పరిశీలన ముమ్మరం చేసిన అధికారులు తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటర్ ఎన్రోల్మెంట్కు నిలిపివేశారు. అలాగే జూలై 2, 3 తేదీలలో బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 329 పోలింగ్ బూత్‌ల పరిధిలోని బూత్ లెవెల్ అధికారులకు, సిబ్బందికి తొలి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ ఎలక్టోర్రల్ రిజిస్టేష్రన్ ఆఫీసర్, ఖైరతాబాద్ తహసీల్దార్ నయీముద్దీన్ తెలిపారు. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్త ఓటరు నమోదు, సవరణలు నిలిచిపోవడంతో ఇప్పటివరకు వచ్చిన ఫారం-6 ఫారం-7, ఫారం-8 తదితర దరఖాస్తుల పరిశీలన పక్కాగా చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పారదర్శకంగా ఓటరు జాబితా…
ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు జాబితాను పారదర్శకంగా సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇం దులో మరణించిన వారి పేర్లు తొలగించడం ప్రధానం. ఆయా పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు మరణ ధృవీకరణ పత్రం లేదా కుటుంబ సభ్యుల వాంగ్మూలం తప్పనిసరి. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా వయసు ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ కార్డు తప్పనిసరి. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల అధికారులు పర్యటించినప్పుడు చేసే ర్యాండం చెక్‌లో తప్పొప్పులు కనిపిస్తే సంబంధిత అధికారులనే పూర్తి బాధ్యులను చేయనున్నారు. పైన పేర్కొన్న రెండు అంశాలతో పాటు ఓటరు గుర్తింపు కార్డులలో సవరణలు, చిరునామాల మార్పు తదితర అంశాలలో కూడా పూర్తిస్థాయి నిర్ధారణ చేసుకోకుండా ఇంటి వద్ద కూర్చుని ఓటరు జాబితా సిద్ధం చేస్తే సంబంధిత బాధ్యులపై చర్యలు తప్పవని సమాచారం. త్వరలోనే నగారా మోగించనుందనే టాక్ నడుస్తోంది.