సిటీబ్యూరో, బేగంపేట, జూలై 13 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసమేతంగా పూజ చేసి ప్రభుత్వం తరపున పట్టువసస్ర్తాలు , తొలి బోనం సమర్పించారు. అలాగే ఉజ్జయినీ అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో కలియతిరుగుతూ భక్తులను ఆప్యాయంగా పలకరించి ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులతో కలిసి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా సోమవారం రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.