ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రైవేటు సంస్థల ద్వారాప్రతి నెలా జాబ్ మేళాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో పాల్గొనే నిరుద్యోగులకు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేసి వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు ఇస్తున్నారు. సాంకేతికపరమైన పరీక్షలు అవసరమైన వారికి మరుసటి రోజు ఆయా సంస్థల్లో నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇస్తునారు.
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి వారికి ఫలానా చోట ఉద్యోగం ఉంది.. అని చెప్పే వేదిక ఒకటి ఉండాలని హైదరాబాద్ పోలీసులు జాబ్ కనెక్ట్‌ను ఏర్పాటు చేసి దీని కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సైతం కేటాయించారు. ఇందులో సిబ్బంది తిరుగుతూ నిరుద్యోగుల పేర్లను నమోదు చేస్తున్నారు. నెలకు ఒక చోట జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 13 : పోలీసులంటే ఒకప్పుడు కర్కశత్వానికి, కాఠిన్యానికి మారుపేరుగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన పాత్ర పోశిస్తున్నారు. సామాజిక బాధ్యతలను విస్మరించకుండా నిరుద్యోగులకు దారి చూపడంలో సక్సెస్ అవుతున్నారు.
నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరణ
జాబ్ కనెక్టివిటీ మొబైల్ వాహనంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. టీఎంఐ కంపెనీ సౌజన్యంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు అన్ని ప్రాంతాల్లో ఈ మొబైల్ వాహనం క్యాంప్‌లు నిర్వహిస్తున్నది. ఆయా క్యాంప్‌లలో స్వీకరించిన దరఖాస్తులకు పరిష్కారం చూపేందుకు నగరంలో మెగా జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగంలో చేర్పిస్తున్నారు.
టీఎంఐ కంపెనీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక ప్రాంతంలో సంచార వాహనంతో దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రతినెలా ఒక ప్రాంతంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని కంపెనీ ప్రతినిధి కిరణ్ తెలిపారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ప్రాంతంలో సిబ్బందితో కలిసి జాబ్ కనెక్టివిటీ మొబైల్ వాహనంలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతిరోజు ఒక కంపెనీ నుంచి హెచ్ఆర్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే వెస్ట్‌జోన్‌లో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.