మియాపూర్ , మే 15 : ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ రహదారులతో పాటు అవసరమైన చోట ఫ్లై ఓవర్లను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి-కుత్బుల్లాపూర్ రెండు నియోజకవర్గాల మధ్య రద్దీగా ఉండే అత్యంత కీలకమైన జేఎన్టీయూ- ప్రగతినగర్ దారిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి తగు ప్రతిపాదనలను జూన్ 1వ తేదీలోగా సిద్ధం చేయాలని అధికారులను ఆయన కోరారు. జేఎన్టీయూ దారిలో ఫ్లై ఓవర్ నిర్మాణం, అంబీర్ చెరువు సుందరీకరణ పనులపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నిజాంపేట మేయర్ నీలా గోపాల్‌రెడ్డి సహా ఆయా శాఖల అధికారులతో కలిసి విప్ గాంధీ మియాపూర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌పై అధికారులు రూపొందించే ప్రతిపాదనలతో మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఇరుకైన దారుల్లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ఫలితంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మియాపూర్ లింక్ దారి నుంచి నిజాంపేట కమాన్ వరకు ప్రధాన రహదారి వెడల్పు, మోర్ సూపర్ మార్కెట్ నుంచి ప్రగతినగర్ రహదారి వరకు అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరారు.
మియాపూర్ చౌరస్తా నుంచి గండి మైసమ్మ వరకు రూ.130 కోట్లతో చేపడుతున్న రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులను కోరారు. అంబీర్ చెరువు సుందరీకరణ పనుల వేగం పెంచాలని, మురుగు నీరు చెరువులో చేరకుండా నాలా విస్తరణ పనులలో జాప్యం చేయవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కమిషనర్ రామకృష్ణారావు, ఎస్ఆర్డీపీ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఆర్డీసీఎల్ ఈఈ సర్దార్ సింగ్, ఇతర విభాగాల అధికారులు సీపీ ఉమాదేవి, రఘునందన్, రాణి, చెన్నారెడ్డి, ఆనంద్, నారాయణ, నళిని, హుస్సేన్, హరికృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.