యూఎల్సీ ల్యాండ్స్‌లోని కాలనీల్లో జీవో 59 సందడి
అవగాహన పెరగడంతో రుసుం చెల్లించేందుకు మొగ్గు
షేక్‌పేట మండల పరిధిలో 2581 పాత దరఖాస్తులు
బంజారాహిల్స్,ఫిబ్రవరి 25: ప్రభుత్వ స్థలాలు, ల్యాండ్ సీలింగ్‌లో ఉన్న భూముల్లో ఇండ్లను నిర్మించుకున్నవారి ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నంబర్లు 58, 59లకు కొనసాగింపు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో షేక్‌పేట మండల పరిధిలో సందడి నెలకొంది. బస్తీలు, కాలనీల్లో గతంలో క్రమబద్ధీకరణ చేయించుకోని వారికి తాజా జీవోలు ప్రయోజనం కలిగించనున్నాయి. ఈ నెల 21నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. జూన్ 2, 2014 కంటే ముందుగానే ఆయా స్థలాల్లో ఆక్రమణలో ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ చేయనున్నారు. షేక్‌పేట మండల పరిధిలోని 52 నోటిఫైడ్ స్లమ్స్‌లో నివాసం ఉంటున్న పేదలు అత్యధిక ప్రయోజనం పొందారు. జీవో 58 కింద మండల పరిధిలో రికార్డు స్థాయిలో 3500 ఇండ్లను ఉచితంగా క్రమబద్ధ్దీకరించారు. అయితే వార్షిక ఆదాయం 2లక్షలు దాటిన వారికి, ఒకటి కంటే ఎక్కువ అంతస్తులు కలిగిన వారు, యూఎల్సీ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గతంలో జీవో 59కింద క్రమబద్ధ్దీకరణ చేయించుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. కాగా గత ఏడేళ్లలో భారీగా పెరిగిన స్థలాల ధరలు, మార్కెట్ విలువ పెంపు తదితర కారణాలతో ఈసారి జీవో 59కింద ఎక్కువమంది క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
యూఎల్సీ ల్యాండ్స్‌లోని కాలనీలు ఇవే..
షేక్‌పేట మండల పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలు మొత్తం యూఎల్సీ ల్యాండ్స్‌గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. వాటిలో ఇండ్లు కట్టుకున్న వారికి క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు మరోసారి అవకాశం లభించింది. ఓల్డ్ ముంబై రోడ్డుకు రెండువైపులా విస్తరించిన వినాయక్‌నగర్, మారుతీనగర్ బస్తీలతో పాటు వివేకానందనగర్ ,అలం అరా కాలనీ, గుల్షన్ కాలనీ, సమతాకాలనీ, అరవింద కాలనీ, అజీజ్‌బాగ్, ఫాల్కన్ వ్యాలీ తదితర కాలనీలు మొత్తం యూఎల్సీ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో భారీ భవనాలు వచ్చినా ఇప్పటిదాకా క్రమబద్ధ్దీకరణ లేకపోవడంతో రుణాలు పొందే అవకాశం లేదు. దీంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు కూడా లభించడం లేదు. ఆయా బస్తీలు కాలనీల్లో గతంలో ఇచ్చిన జీవో 59 ప్రకారం సగంమంది క్రమబద్ధ్దీకరణ చేయించుకున్నారు. మిగిలినవారు తాజా జీవో ప్రకారం క్రమబద్ధీకరణ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలాల్లోని బస్తీలకు మరో అవకాశం
షేక్‌పేట మండల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో అనేక బస్తీలు ఏర్పాడ్డాయి. మండల పరిధిలోని ఫిలింనగర్ 18బస్తీలు, ఎన్బీటీనగర్,ఎన్బీనగర్, బోళానగర్, ఖాజా నగర్, శ్రీరాంనగర్, ఉదయ్‌నగర్, నూర్‌నగర్, ఇబ్రహీంనగర్, నందినగర్, వెంకటేశ్వరనగర్, షౌకత్నగర్, దేవరకొండ బస్తీ, ఇందిరానగర్, జవహర్‌కాలనీ బస్తీలు ప్రభుత్వ స్థలాల్లో ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలో అత్యధిక సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలే ఉన్నాయి. వీటన్నింటినీ జీవో నంబర్ 59 కింద క్రమబద్ధీకరించుకోవాలని గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఈసారి వచ్చిన అవకాశంతో ప్రయోజనం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
నోటీసులు పొందినవారు క్రమబద్ధీకరణ చేయించుకోవాలి
గతంలో జీవో నంబర్ 58 కింద దరఖాస్తులు చేసుకున్నవారిలో బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వార్షిక ఆదాయం 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవారికి దరఖాస్తులను జీవో నంబర్ 59 కిందకు మారుస్తూ నోటీసులు ఇచ్చాం. అలాంటి వారందరూ వెంటనే 2014మార్కెట్ విలువ ప్రకారం నిర్దేశిత రుసుం చెల్లిస్తే వెంటనే కన్వీయెన్స్ డీడ్ ద్వారా ఇండ్లను రిజిస్ట్రేషన్ చేస్తాం. గతంలో దరఖాస్తు చేసుకోనివారు ఈ సారి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యూల్ఎసీ ల్యాండ్స్‌లో ఉన్న ఇండ్ల యజమానులకు క్రమబద్ధీకరణ ప్రక్రియ గురించి అవగాహన కల్పించేందుకు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. మండల పరిధిలో గతంలో జీవో 59కింద సుమారు 970 ఇండ్లను క్రమబద్ధ్దీకరించాం. మరో 2581 మందికి నోటీసులు ఇచ్చాం. వారందరూ వెంటనే రుసుం చెల్లించి క్రమబద్ధీకరణ పొందాలన్నారు. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం