హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం(Technology ) నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan ) అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ అనేక రంగాల్లో విప్లవాత్మమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు. కరోనా తరువాత డిజిటలైజేషన్ (Digitization) ప్రభావం పెరిగిందన్నారు.
ఐటీ రంగం ( IT Sector) లో తెలంగాణ దూసుకుపోతుందని, ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఐటీ రంగం ముందుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. రవాణా, దేవాదాయ, వాణిజ్య పన్నుల శాఖ, టీఎస్ఐపాస్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లాంటి ప్రభుత్వ శాఖలు పూర్తిగా డిజిటలైజ్ అయ్యాయని వివరించారు. మీ సేవ ద్వారా 600 రకాలకు పైగా సేవలు ఆన్లైన్ (Online)లో అందుతున్నాయన్నారు. వీటన్నంటి ద్వారా ప్రజలకు మెరుగైన, సులువుగా సేవలు అందుతున్నాయన్నారు.
సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలంగాణ గత పది సంవత్సరాలుగా అసమాన ప్రతిభను కనపరుస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కన్వీనర్ సంజీవ్ దేశ్ పాండే, కో కన్వీనర్ రామకృష్ణ , బ్రాడ్గేజ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఎండీ శీనం ఓరి తదితరులు పాల్గొన్నారు.