జవహర్‌నగర్, ఏప్రిల్ 10: మహనీయులు కొందరి వారు కాదని… అందరివారని… వారికి కులం, మతం లేదని… భారతదేశంలోని మహనీయులు వారి జీవితకాలంలో పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడారు. మహనీయుల జయంతి ఉత్సవాలను కుల, మత, ప్రాంత వర్గ విభేదాలు లేకుండా జరుపుకునేందుకు జవహర్‌నగర్‌లోని 70కుల సంఘాలు, 10 ప్రజాసంఘాలు ఏకతాటిపైకి వచ్చి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తున్నాయి. ప్రజలందరికీ స్ఫూర్తి నింపేలా చైతన్యపరుస్తూ, మా ఊరి బలం..బలగాన్ని చాటి చెబుతూ రాష్ర్టంలోనే జవహర్‌నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ ఆదర్శవంతంగా నిలుస్తోంది.
భిన్నమతాలకు నిలయం…
జవహర్‌నగర్‌లో దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారు. మినీ భారత్‌గా కూడా పేరుగాంచింది. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే స్ఫూర్తిగా నేటి మహనీయుల మాసంగా ఏప్రిల్ మాసాన్ని జరుపుకుంటున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పండుగలా జరుపుతూ ప్రజలందరికీ రాజ్యాంగ హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
మా ఊరు బలం.. బలగం
తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా చూపించిన కుటుంబ కథాచిత్రం బలగం… చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా చూసి ఎన్నో కుటుంబాలు ఒక్కటయ్యాయని, రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని కులాలను ఏకం చేసి ఒకే తాటిపైకి వచ్చిన జవహర్‌నగర్ బలగాన్ని ఎంతో మంది ప్రశంసిస్తున్నారు.
మహనీయులను స్మరించుకుంటూ… స్ఫూర్తి నింపుతూ…
జవహర్‌నగర్ కార్పొరేషన్లో మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మండల సురేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్సవ కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇందులో భిన్న కులాలు, మతాలు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులకు చోటు కల్పించారు. మహనీయుల జయంతి, వర్ధంతి ఏదైనా అందరం కలిసి వారిని స్మరించుకోవాలన్న ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయాలని నిర్ణయించారు. మహనీయుల కమిటీ ఆధ్వర్యంలో యువత, ప్రజలు, మహిళా సంఘాలకు విద్యా హక్కులు, చట్టాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ బలమైన స్ఫూర్తిని నింపుతున్నారు.
మహనీయుల బాటలో పయనం…
మహనీయుల బాటలో పయనిస్తే విజయానికి సుగమం అవుతుందని మహనీయుల ఉత్సవ కమిటీ చెబుతున్నది. చదువే జీవనానికి కొలమానం అని, చదువు లేకుండా భవిష్యత్తు అంధకారమేనని పేర్కొంటున్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులతో రిజర్వేషన్ లభించిందని, దేశంలోని అణగారిన వర్గాలు అభ్యున్నతి చెందుతున్నాయంటే అంబేద్కర్ అందించిన ఫలాలే నేటి విజయగాథలు అని విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ… వారిలో ఉత్సాహం నింపుతున్నారు.