సిటీ బ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వినియోగదారులను జలమండలి పట్టించుకోవడం లేదు. బిల్లుల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. వేసవిలో తాగునీరందించడంలో పూర్తిగా విఫలమైందని వినియోగదారుల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలను తెలిపేందుకు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సిస్టం, గ్రీవెన్స్ కూడా పూర్తిగా విఫలమవుతున్నది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
జలమండలి సేవల్లో వినియోగదారులకు ఏమైనా అసౌకర్యం కలిగినా.. క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడినా ఫిర్యాదు చేసేందుకు మెట్రో కస్టమర్ కేర్(ఎంసీసీ) పేరిట వినియోగదారుల సేవల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. లో ప్రెషర్, తాగునీటి సరఫరాలో అంతరాయం, కలుషిత నీళ్లు సరఫరా కావడం, పైపులైన్ సమస్యలపై కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేస్తారు. వినియోగదారులు చేసిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయాల్సిన బాధ్యత ఎంసీసీకి ఉంటుంది. క్షేత్రస్థాయిలోకి సిబ్బంది వెళ్లి సమస్యను పరిష్కరించాక వినియోగదారుడికి ‘రీసాల్వ్డ్’ అనే మెసేజ్ వస్తున్నది. కానీ గత కొద్ది నెలలుగా జలమండలి పరిధిలోని వినియోగదారులు ఎలాంటి సమస్యపైన ఫిర్యాదు చేసినా పరిష్కరించకుండానే రీసాల్వ్డ్ అనే మెసేజ్ వస్తున్నది. వేసవి మొత్తం ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తున్నారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా మారని తీరు
బోడుప్పల్‌కు చెందిన ప్రవీణ్ కొద్ది నెలలుగా లోప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని జలమండలి కస్టమర్ కేర్‌కు గత ఐదు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నారు. జూన్ 6న (టికెట్ నంబర్ 5685), ఏప్రిల్ 9 (3657), మార్చి 7(6013), ఫిబ్రవరి 3న (4645) కస్టమర్ కేర్‌కు ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని ఫిర్యాదుల్లో తమ ప్రాంతంలో లో ప్రెషర్ సమస్య ఉందని తెలిపారు. తమ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకుంటే వినియోగదారుల కోర్టుకు వెళతానని ప్రవీణ్ స్పష్టం చేశారు.
ఇటీవల జలమండలి ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో మురుగు రోడ్లపై ఏరులై పారింది. రోజుల తరబడిగా బురద, దుర్వాసనతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశారు. రీసాల్వ్డ్ అనే మెసేజ్ చూసి ఆగ్రహించిన ప్రజలు నిరసనకు దిగగా జలమండలి ఎండీ దృష్టికి వెళ్లడంతో పరిష్కరించారు.