సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధించడం, వెకిలి చేష్టలతో ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటాయని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నేరాల కింద కేసులు నమోదై.. జైలుకు వెళితే బంగారు భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన మూడు కేసుల్లో మహిళలను వేధించిన నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించడంతో న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని తెలిపారు.
బ్లాక్ మెయిలింగ్
గచ్చిబౌలికి చెందిన శ్రీకర్‌కు 23 ఏండ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెండ్లి చేసుకుందామనుకున్నారు. ఆ తర్వాత శారీరకంగా కలువాలంటూ శ్రీకర్ నిత్యం ఆమెను వేధిస్తున్నాడు. తొలుత ఇద్దరం సెటిల్ అవ్వాలి.. ఆ తర్వాత పెండ్లి చేసుకుందాం. ఆ తర్వాతే అన్ని అంటూ బాధితురాలు నచ్చజెప్పింది. దీంతో శ్రీకర్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తనను సంతృప్తి పరచకపోతే.. ఆమె ఫొటోలు, వీడియోలు మొత్తం కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాధితురాలు తొలుత ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆమె షీ టీమ్స్‌ను ఆశ్రయిచింది. కేసు నమోదు చేసిన షీ టీమ్స్ పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పి, నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం 5 రోజుల జైలు శిక్ష విధించింది.
మరో సంఘటనలో..
భార్యా భర్తల మధ్య గొడవలు జరిగి విడిపోయారు. బాధితురాలు కూతురితో కలిసి ఉంటుంది. కూతురు కోసం ఆన్లైన్ ట్యూటర్‌గా రెహమాన్‌ను ఏర్పాటు చేసింది. ట్యూటర్ ఆ పాపకు మాయ మాటలు చెప్పాడు. చిన్నారి అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె వ్యక్తిగత ఫొటోలు తీసి ఇవ్వాలంటూ సూచించాడు. తల్లికి తెలియకుండా ఆ పాప ఫొటోలు తీసి తన ట్యూషన్ సార్‌కు పంపించింది. ఆ ఫొటోలను అతడు బాలిక తల్లికి పంపించి, పెండ్లి చేసుకోవాలంటూ.. గుర్తుతెలియని వ్యక్తిగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె నిరాకరించింది. ఆ ఫొటోలను ఆమె మాజీ భర్తకు పంపించి.. మీ భార్య మరో వ్యక్తితో తిరుగుతుందని, మీ పాపకు అక్కడ సరైన రక్షణ లేదంటూ చెప్పాడు. ఈ విషయంపై ఆమె మాజీ భర్త నిలదీశాడు. తన ఫొటోలు ఎలా బయటకు వెళ్లాయని ఆరా తీయడంతో కూతురు తీసి, ట్యూషన్ టీచర్‌కు పంపించినట్లు తెలిసింది. షాక్‌కు గురైన బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. రెహమాన్(50)ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా.. అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఎన్టీఆర్ గార్డెన్ వద్ద..
ఎన్టీఆర్ గార్డెన్ వద్ద మహిళను వేధిస్తున్న మహ్మద్ హుస్సేన్, అబ్దుల్ షఫీని షీటీమ్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కోర్టులో హాజరు పర్చింది. వారికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.