సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): పరిహారం, రహదారి వెడల్పు తేలకుండానే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ముందుకు సాగుతుండటంతో…. రాజీవ్ రహదారి బాధితులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. భూసేకరణ వ్యవహారం కొలిక్కి రాకుండా, బాధితుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండానే ప్రాజెక్టును చేపట్టేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని ఉద్యమిస్తూనే ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పడిన రాజీవ్ రహదారి జేఎసీ ఆధ్వర్యంలోనే ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు, సీఎం రేవంత్‌రెడ్డికి తమ గోడును వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉద్యమానికి నిర్ణయం..
జేఎసీ నాయకులు తేలుకుంట సతీశ్, సభ్యుల ఆధ్వర్యంలో సమావేశమైన జేఏసీ సభ్యులు… ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికీ పార్టీలకతీతంగా తమ ఆవేదనను వివరించామని, తమకు మద్దతు తెలిపే పార్టీల సహకారంతో ఎలివేటెడ్ కారిడార్ ద్వారా జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కొనేలా ఉద్యమించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఎలివేటెడ్ కారిడార్ వెడల్పును 200 మీటర్ల నుంచి 100-150 మీటర్లకు తగ్గించడం, రక్షణ శాఖకు చెల్లిస్తున్నట్లుగానే పరిహారం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం జేఎసీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. ఇక ఇంటింటికి ఎలివేటెడ్ కారిడార్ ఉద్యమ కార్యాచరణను తీసుకెళ్లేలా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.