సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ చెల్లింపులు చేస్తామని ప్రయాణికులు చెబుతున్నప్పటికీ కండక్టర్లు మెషిన్లు పనిచేయడం లేదని నగదు ఇవ్వాలని పేచిపెడుతున్నారు. అదేంటీ డిజిటల్ చెల్లింపులు సేవలు ఉన్నాయి కదా అని ప్రయాణికులు అడిగితే.. బస్సు దిగిపోండని బెదిరిస్తున్నట్టు రవి అనే ప్రయాణికుడు చెప్పాడు. సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఐ-టిమ్స్ మెషిన్లు పనిచేయడం లేదని కండక్టర్లు చెబుతున్నారు.
గతంలో గ్రేటర్లో బండ్లగూడ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ కండక్టర్లకు ఐటిమ్స్పై అవగాహన కల్పించి బస్సుల్లో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో గ్రేటర్లోని 70 శాతం బస్సుల్లో ఐటిమ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో యంత్రాలు పనిచేయడం లేదు. క్యూఆర్ కోడ్ రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి ఆపరేటింగ్పై అవగాహన లేకపోవడంతో నగదు ఇవ్వాలని ప్రయాణికులతో ఘర్షణకు దిగుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ కండక్టర్లు చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో వస్తేనే..
అన్నీ రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్లు జారీ చేయడానికి ఆర్టీసీ అధికారులు ఐటిమ్స్ మెషిన్లను తీసుకొచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆర్టీసీ అధికారులు డిపోల వారీగా ఐ టిమ్స్ యంత్రాల పనితీరును పరిశీలిస్తున్నారు. సాంకేతిక బృందాలు వాటి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం చేస్తున్నారు. ఆ మెషిన్ల పనితీరులో ఏమైన లోపాలున్నాయా? ఎంత సమయంలోపున పేమెంట్ అవుతుంది? స్కానర్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా? తదితర సాంకేతిక సమస్యలపై టెక్నికల్ టీం సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు.